హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : రెండు దశాబ్దాలుగా పెం డింగ్‌లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ వేయనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టంలోని నిబంధనలకు విరుద్ధం గా ప్రభుత్వం జీవో 45 జారీచేసిందంటూ హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన సంతోష్‌కుమార్, ఇతరు లు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశా రు. ఇదే అంశంపై అప్పటికే దాఖలైన పిటిషన్లపై కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు.
ఆ పిటిషన్లపై హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. గత అక్టోబర్‌లో విచారణ సందర్భంగా చివరి అవకాశం ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయలేదని తప్పుపట్టింది. 2006నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ప్రతి పిటిషన్‌కు రూ.5వేల చొప్పున జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు జనవరి 9 వరకు గడువు ఇచ్చింది. రిప్లయ్ కౌంటర్లను జనవరి 20లోగా దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత దాఖలుచేసే కౌంటర్లను అనుమతించరాదని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో రూ.2583 కోట్లతో 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన హైకోర్టు భవనానికి సంబంధించి జ్యుడీషియల్ అధికారుల సూచనల మేరకు సవరించిన ప్లాన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ కన్సల్టెంట్ ఏజెన్సీలను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి హైకోర్టు భవన నిర్మాణ పనులను వికాస్‌రాజ్ పర్యవేక్షించారు. పనుల్లో జాప్యం కలుగకుండా కన్సల్టెంట్లు డ్రాయింగ్ షెడ్యూల్‌ను ముందుగానే ఇవ్వాలని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్లు రాజేశ్వర్‌రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.