హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పిటిషన్లపై హైకోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ పనులతో వారసత్వ కట్టడాలకు నష్టం కలిగే అవకాశం ఉన్నదని, ఎంజీబీఎస్ -శంషాబాద్ కారిడార్‌లో మెట్రో విస్తరణ పనులను నిలిపివేయాలని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రహీంఖాన్, మరొకరు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది రామారావు వాదనలు వినిపిస్తూ.. ప్రతిపాదిత నిర్మాణం వారసత్వ కట్టడాలపై ప్రభావం చూపుతుందని, కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని, అనుమతులు లభించే వరకు మెట్రో విస్తరణ చేపట్టరాదని ఆదేశించాలని కోరారు.