హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ కంపెనీలు, వాటి ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను విచారణ చేసే అధికారం రాష్ట్ర మానవ హకుల కమిషన్‌కి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. మానవ హకుల కమిషన్ చట్టం-1993 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, వారి నిర్లక్ష్యానికి సంబంధించిన ఫిర్యాదులపై మాత్రమే ఎస్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని, కమిషన్ తనంతట తానుగా అధికార పరిధిని విస్తరించుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఓ కంపెనీలో లైంగిక వేధింపులకు సంబంధించి ఇద్దరు మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై మానవ హకుల కమిషన్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వెల్స్ ఫార్గో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఉద్యోగులపై లైంగిక వేధింపులు తీవ్రమైన అంశమే అయినా, వాటిపై విచారణకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉన్నదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులైన బాధిత మహిళలు సంబంధిత సంస్థలను ఆశ్రయించాలని సూచించింది.