
సికింద్రాబాద్, జనవరి 12: మిట్ట మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయం…..అందరూ భోజనం చేస్తున్న వేళ…ఒక్కసారిగా మూడో అంతస్తులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు ఏం జరుగుతుందో అర్థం కాక పరుగులు పెట్టారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని పన్నుల విభాగంలో బుధవారం చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదం ఉద్యోగులను భయాందోళనకు గురిచేసింది. సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. ఎంతో విలువైన ఫైళ్లు, రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కొందరు సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో లిఫ్ట్ ద్వారా కిందికి దిగాల్సిన వారు అందులోనే చిక్కుకు పోయారు. వారిని ఇతర సిబ్బంది రిస్క్ చేసి బయటికి తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు బిల్డింగ్ పైకి చేరుకున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరి ఆడక సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటినా జోనల్ కార్యాలయానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. పై అంతస్తులో చిక్కుకున్న వారిని క్రేన్ సహాయంతో కిందికి తీసుకువచ్చారు. ఘటన వెనుక ఎవరిదైనా హస్తం ఉందేమోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.