హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది.. కృష్ణమ్మ ఉరలేస్తున్నది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. శుక్రవారం కడెం ప్రాజెక్టుతోపాటు, లోకల్ క్యాచ్మెంట్ ఏరియాల నుంచి ఎల్లంపల్లికి 44వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాణహిత నుంచి వచ్చే వరద 11 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది. సమ్మక్కసాగర్ వద్ద 12.60 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ఏటూరునాగారం, భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. కృష్ణమ్మ సైతం ఉరలేస్తున్నది. ప్రస్తుతం జూరాలకు 1.22 లక్ష క్యూసెక్కులు వరద వస్తుండగా, దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు 89వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ధర్మారం/ రామడుగు, జూలై 31 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు శుక్రవారం మూడో రోజు కొనసాగాయి. ఐదు పంపుల ద్వారా 15,750 క్యూసెకులను నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. అక్కడి నుంచి అదే జంట సొరంగాల ద్వారా గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు.
గద్వాల/నాగర్‌కర్నూల్, జూలై 31 : జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ ఉరకలెత్తుతున్నది. శుక్రవారం 1.22 లక్షల క్యూసెక్కులు రాగా.. 24 గేట్లు ఎత్తి దిగువకు 1,36,689 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 834.40 అడుగులకు చేరగా.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 54.34 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మహారాష్ట్ర వరదనీటితో పెన్‌గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. జిల్లాలోని భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో పరీవాహక పంట పొలాలు నీటమునిగాయి. జైనథ్ మండలం డొల్లార వద్ద ఉత్తరాది రాష్ర్టాలను కలిపే జాతీయ రహదారి 44 పై ఉన్న వంతెనను తాకుతూ ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులను దాటింది. భద్రాద్రి ఏజెన్సీలోని వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపును గోదావరి వరద చుట్టుముట్టింది.

పాయలోని ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్లతోపాటు 46 మంది ర్యాంపు సిబ్బంది,లారీలు చిక్కుకున్నాయి. రెస్క్యూ బృందాలను యంత్రాలు, తెప్పలపై వెళ్లి ర్యాంపు సిబ్బంది, డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.