తిరుమల/హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలతో తిరుమల జలమయమైంది. కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుపతిలోని వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జ్‌లు వర్షపు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించిపోయాయి. వాతావరణం అనుకూలించక రేణిగుంట నుంచి విమానాలు హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానంను బెంగళూరుకు మళ్లించారు. ఎయిర్ ఇండియా, స్సైస్ జెట్ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగాయి.
తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమాడ వీధులు జలమయమయ్యాయి. కనుమ దారులు, మెట్ల మార్గంలో భారీగా వరద ప్రవహిస్తున్నది. రెండో కొండచరియలు విరిగిపడటంతో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రెండో కనుమదారిలో హరిణి వద్ద రహదారిపై చెట్టు కూలింది. కొండపై నుంచి మట్టి, రాళ్లు కొట్టుకొచ్చాయి. వాహనాలు నిలిచిపోవడంతో టీటీడీ అధికారులు రాళ్లను తొలగిస్తున్నారు. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలు, పాపవినాశనం రహదారిని టీటీడీ మూసివేసింది. అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో జలపాతాన్ని తలపిస్తన్నది. అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద మెట్లపైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. కొండపై నుంచి వస్తున్న నీటితో కపిలేశ్వరాలయం జలపాతం జోరుమీదుంది.