Health Tips : నువ్వులు (Sesame seeds) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంతోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నువ్వులను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో.. చెడు కొలెస్టరాల్‌ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో.. ఎముకలను పటిష్టం చేయడంలో.. జీర్ణవ్యవస్థ, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నువ్వులు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. నువ్వులలో పీచు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి నువ్వులను తీసుకోవడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నువ్వులు చాలా మంచిది.
2. నువ్వులు తింటే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలోని ‘ఒలియిక్ యాసిడ్’, ‘లినోలిక్ యాసిడ్’ వంటివి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3. నువ్వులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నువ్వులలో ఉండే అధిక కాల్షియం ఎముకల బలోపేతానికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో పోరాడేందుకు నువ్వులను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
4. నువ్వులు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా చాలా మేలు చేస్తాయి. నువ్వులలోని అధిక పీచు అరుగుదలకు తోడ్పడుతుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి నువ్వులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
5. నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నువ్వులలో ఉండే అనేక పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా నువ్వుల్లో ఉండే విటమిన్ బి6 మెదడుకు మేలు చేస్తుంది.
6. నువ్వులు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. నువ్వులలోని విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు సహకరిస్తాయి. చర్మాన్ని తేజోవంతంగా ఉంచుతాయి.