‘చెరకు రసం’ అద్భుతమైన ఔషధమని ఆయుర్వేదం అంటున్నది. ముఖ్యంగా, గర్భిణుల ఆరోగ్యానికి తక్షణ రక్షణ కల్పిస్తుందని తేల్చింది. విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభించే ‘చెరకు’తో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
గర్భిణులు జలుబు, దగ్గు మందులను వాడకూడదని వైద్యులు సూచిస్తారు. ఆ సమయంలో చెరకు రసం తీసుకుంటే.. జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.
నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. చెరకు రసంలో శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభిస్తాయి. డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి.
గర్భిణులు ఎదుర్కొనే మరో సమస్య.. మలబద్ధకం. చెరకులో ఫైబర్ ఎక్కువగా ఉండి, పేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది. దాంతో మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది. మలబద్దకంగా అనిపించినప్పుడు చెరకు తినడం మంచిది.
చెరకు రసంలో ఉండే ఫోలిక్ యాసిడ్.. గర్భస్థ పిండంలో ఏర్పడే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ సమస్య నుంచి కాపాడుతుంది.
వాంతులు, వేవిళ్ల కారణంగా.. కొందరు గర్భిణులు సరిగ్గా భోజనం చేయరు. దాంతో విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. అలాంటప్పుడు గ్లాసు చెరకు రసం తీసుకుంటే.. క్షణాల్లో చురుగ్గా తయారవుతారు. అసిడిటీని తగ్గించడంలోనూ ఇక్షు రసం చక్కగా పనిచేస్తుంది.
చెరకు రసంలో అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగడం మంచిది. ఈ పానీయంలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి తల్లీబిడ్డల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
చెరకులో ఉండే యాంటి ఎమెటిక్ లక్షణాలు.. వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
పిగ్మెంటేషన్, చర్మం పొడిబారడం లాంటి సమస్యలూ గర్భిణుల్లో కనిపిస్తాయి. చెరకు రసంలో ఉండే ైగ్లెకోలిక్ యాసిడ్.. చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
ఇందులో విటమిన్ ఎ, బి, సితోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలాంటి మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. అయితే, చెరకు రసాన్ని మితంగా తీసుకుంటేనే మంచిది. పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.