ఆధునిక జీవితంలో ఆరోగ్య బీమా ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతున్నది. కరోనా నేపథ్యంలో అందరికీ ఇది తప్పనిసరైందంటే అతిశయోక్తి కాదు. కేవలం గడిచిన ఏడాదిన్నర కాలంలోనే వైద్య ఖర్చులు సగటున 23 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, దవాఖాన, కన్సల్టేషన్ వ్యయాలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ క్రమంలో ఆరోగ్య బీమాతో గొప్ప ఊరటే లభించిందనడంలో సందేహం లేదు. అయితే కుటుంబం మొత్తానికి సరిపోయే ఆరోగ్య బీమా ఏదన్నదానిపై చాలామందికి అనేకానేక ప్రశ్నలు తలెత్తడం సహజమే. కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం డయాగ్నోసిస్ మొదలు ట్రీట్మెంట్ వరకు అన్ని ఖర్చులను కవర్ చేసేలా ఆరోగ్య బీమాను తీసుకోవడం చాలా ముఖ్యం.
టాప్అప్తో కవరేజీ పెంపు
వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరుగుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మెడికల్ రిస్క్‌లూ ఉంటాయి. కాబట్టి వీటికి సరిపడా ఆరోగ్య బీమా కవరేజీ అవసరం. అందుకు టాప్అప్లు చక్కగా ఉపయోగపడుతాయి. ప్రస్తుత పాలసీలకు ఇవి అదనపు కవరేజీని తీసుకొస్తాయి. ఇదొక రకంగా రీయింబర్స్మెంట్ లాంటిది.
వయో వృద్ధుల కోసం..
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో 60 ఏండ్లకు పైబడిన తల్లిదండ్రులను చేర్చడం వల్ల ప్రీమియంను చాలా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకని వయో వృద్ధుల కోసం వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీనే తీసుకోవాలి. దీనివల్ల వారికి ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలకూ కవరేజీ లభించేలా పాలసీ ఉంటుంది.
ఎంప్లాయర్ గ్రూప్ కవరేజీ
ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీ చాలా చౌకగా ఉంటుంది. ఇందులో కుటుంబ సభ్యులకూ కవరేజి లభిస్తుంది. క్యాష్‌లెస్ క్లెయి ములు.. ముందుగానే ఉన్న ఆరోగ్య సమస్యలకూ వర్తిస్తాయి.
ప్రసూతి ఖర్చులూ పాలసీ మొదటి
రోజు నుంచే కవర్ అవుతాయి. వెయిటింగ్ పీరియడ్ ఉండదు. మిగతా పాలసీల కన్నా లాభదాయకంగా ఉంటా యి. అయితే ఇవి తక్కువ కవరేజీనే అందిస్తాయి.
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ
చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే పెద్ద బీమా పొందవచ్చు. ప్రధానంగా చిన్న పిల్లలతో ఉన్న కుటుంబానికి ప్రస్తుత వైద్య ఖర్చుల ప్రకారం రూ.5 లక్షల కవరేజీతో ఉండే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ సరిపోతుంది. పాలసీ తీసుకునే ముందే దాని ప్రయోజనాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో పెరిగే మెడికల్ ఎమర్జెన్సీ కేసులనూ దృష్టిలో పెట్టుకోవాలి.