వేములవాడ : రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఓపీ సేవలు పొందేవారి సంఖ్య 1.36కోట్లకు చేరిందని, ఇంతకు ముందు 78.50లక్షలుగా ఉండేదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గతంలో 67వేల శస్త్ర చికిత్సలు జరిగేవని, ప్రస్తుతం 2.3లక్షలకు చేరిందని.. 1.26లక్షల కాన్పులు చేశామని పేర్కొన్నారు. వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. విభాగాల వారీగా రికార్డులను తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో అందుతున్న సేవలు బాగున్నాయని ప్రశంసించారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య సిబ్బంది, స్టాఫ్ నర్స్‌లను సమకూరుస్తామన్నారు. వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత సేవలు గణనీయంగా పెరిగాయన్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకునేందుకు రోగులు పెరిగారన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలతో సేవలు విస్తృతమయ్యాయని చెప్పారు. వేములవాడ ఆసుపత్రి వైద్యుల పనితీరును ప్రశంసించారు.
ఉస్మానియా, గాంధీ లాంటి ఆసుపత్రిలో జరిగే అరుదైన మోకాలు కీలు మార్పిడి చికిత్సలను వేములవాడ
లాంటి ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే నిర్వహించారన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వమందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏరియా ఆసుపత్రి సూపర్ ఇండెంట్లు డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, డాక్టర్ మురళీధర్ రావు, వైద్యాధికారులు అనిల్ కుమార్, సంతోష్ చారి, తిరుపతి, హెడ్ నర్స్ స్టెల్లా, భాగ్యలక్ష్మి ఉన్నారు.