లక్నో, మార్చి 5: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకున్నది. సోమవారం చివరి(ఏడో) విడుత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. పూర్వాంచల్ పరిధిలోని 54 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో పాటు ఎస్పీ అధినేత ఎంపీగా ఉన్న అజంగఢ్, మీర్జాపూర్, మౌవ్, జాన్పూర్, ఘాజీపూర్, చన్‌దౌలి, భదోహి, సోన్‌భద్ర జిల్లాలు చివరి విడుత ఎన్నికల జాబితాలో ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి, మీర్జాపూర్ జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ కూటమి కైవసం చేసుకున్నది. అయితే ఈసారి ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని, ప్రధానంగా ఈ రెండు జిల్లాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు వారణాసి జిల్లాలో బీజేపీ టికెట్టు ఆశించి భంగపడిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. వీరు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో స్థానాలు కోల్పొతే పాపులారిటీపై దెబ్బ పడుతుందనే ఆందోళనతో ప్రధాని మోదీనే నేరుగా రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు వారణాసిలోనే మకాం వేశారు. శుక్రవారం వారణాసి నగరంలో రోడ్‌షో చేపట్టగా, శనివారం మిగతా నియోజకవర్గాల్లో ర్యాలీలు చేశారు.
మరోవైపు మీర్జాపూర్ జిల్లాలో బీజేపీకి ఎస్పీ నుంచి గట్టి పోటీ ఎదురౌతున్నది. ఇక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టు తరహాలో మీర్జాపూర్లో వింధ్ ప్రాజెక్టు పేరుతో 930 ఇండ్ల కూల్చివేత అంశం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నది. దీనిపై ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రోడ్ల విస్తరణలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత కులమైన ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ఇండ్లను కావాలనే తప్పించి, బ్రాహ్మణులు, వైశ్యులకు చెందిన నివాసాలను కూల్చివేశారని స్థానికుడు చెప్పారు. దీనికి సంబంధించి బాధితుల తరఫున స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రత్నాకర్ ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు.
మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో తమ పట్టును తిరిగి నిలబెట్టుకునేందుకు బీజేపీ.. ఆ పార్టీని దెబ్బకొట్టేందుకు ఎస్పీ చూస్తున్నాయి. ఇందులో భాగంగా తమ మిత్రపక్షాలకు ఓ టాస్క్‌ను అప్పగించాయి. వారణాసిలోని 8 నియోజకవర్గాల్లో స్థానికంగా ఓబీసీ కుర్మి అని పిలువబడే పటేల్ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు 2 లక్షలు, ఓబీసీ రాజ్భర్లు లక్ష మంది ఓటర్లు ఉన్నారు. వీరిని తమ కూటముల వైపు ప్రసన్నం చేసే బాధ్యతను బీజేపీ తన మిత్రపక్షమైన కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్(ఎస్)కి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన మిత్రపక్షాలైన అప్నాదళ్(కే)తో పాటు, ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు అప్పగించారు. గత ఎన్నికల్లో ఓం ప్రకాశ్ బీజేపీతో కలిసి పోటీచేశారు. గతసారి పరిస్థితులకు, ఈసారి చాలా తేడా ఉందని, యోగి అదిత్యనాథ్‌ను గద్దె దింపాలనే కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారని అప్పాదళ్(కే) నేత పల్లవి పటేల్ పేర్కొన్నారు. వారణాసిలో 8 స్థానాలకు తమ కూటమి తప్పకుండా ఆరింటిలో గెలుస్తుందని రాజ్‌భర్ చెప్పారు..