పర్వతగిరి, ఆగస్టు 29: రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడ్డట్టు చరిత్రలో లేదనేది అక్షర సత్యం. కానీ, తన పాలనలో రైతులను అరిగోస పెడుతూ కాంగ్రెస్ పాలకులు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది నేటి నిజం. యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఉట్టి తండాకు చెందిన భూక్యా బాలునాయక్ కుటుంబంతో కలిసి వినూత్న నిరసన తెలిపాడు. యూరియా దొరకక విసుగుచెందిన బాలునాయక్ ఏడెకరాలలోని పత్తి చేనును పీకేశాడు. కాంగ్రెస్ పాలనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు.
యూరియా దొరక్క పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థంగాక కడుపుమండి పత్తి చేనును పీకేసినట్టు రైతు బాలు కన్నీటి పర్యంతమయ్యాడు. గతంలో సీఎం కేసీఆర్ సారు రైతాంగానికి అన్ని విధాలుగా అండగా నిలిచారని గుర్తుచేశారు. నేడు సీఎం రేవంత్రెడ్డి రైతుల కంట కన్నీటికి కారణమయ్యాడని, దగా చేశాడని మండిపడ్డారు. బాలునాయక్ కుటుంబం నిరసన విషయం తెలిసిన బీఆర్ఎస్ నాయకులు వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. ఆత్మహత్యే శరణ్యమని భావించిన బాలునాయక్కు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వీరన్ననాయక్, నాయకులు మహేశ్, రాజుయాదవ్ అండగా బాసటగా నిలిచారు.