ముంబై, జూలై 19: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం 1.31 శాతం తగ్గి రూ.16,258 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.16,475 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.83,701 కోట్ల నుంచి రూ.99,200 కోట్లకు ఎగబాకింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.14,442 కోట్ల నిధులను వెచ్చించడంతో లాభాల్లో గండిపడిందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.33 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగాయి. మరోవైపు, వాటాదారులకు బ్యాంక్ శుభవార్తను అందించింది. 1:1 బోనస్ షేరును ప్రకటించింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా శనివారం సమావేశమైన బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతోపాటు రూ.5 ప్రత్యేక డివిడెండ్ చెల్లింపులు జరపనున్నట్లు వెల్లడించింది.
యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయం
న్యూఢిల్లీ, జూలై 19: యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,116 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.3,676 కోట్ల లాభంతో పోలిస్తే 12 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.31,791 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.52 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.90 శాతం నుంచి 0.62 శాతానికి తగ్గాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ నిధుల కేటాయింపులు రూ.1,651 కోట్ల నుంచి రూ.1,153 కోట్లకు తగ్గాయి.