High Court : ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో షాక్. నానక్‌రామ్‌గూడ (Nanakramguda) భూముల వ్యవహారంలో రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి, మామ సూదిని పద్మా రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కొండల్ రెడ్డి, పద్మా రెడ్డిలు అక్రమంగా సేల్ డీడ్ చేశారని దాఖలైన పిటీషన్ విచారణ సందర్బంగా.. భూమిపై స్టేటస్ కో విధిస్తూ రెవెన్యూ అధికారులకు నోటీసులిచ్చింది హైకోర్టు.
నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్ 75/1లో 2.10 ఎకరాల నిషేధత భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, మామ సూదిని పద్మారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు అనుమతించారు. సీఎం అండదండలు చూసుకొని ఆయన సోదరుడు, మామ పేరుతో రిజిస్ట్రేషన్‌కు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ సీఎండీ మడల సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శనివారం పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం సదరు భూమిపై స్టేటస్ కో విధించింది. అంతేకాదు అధికారులతో పాటు కొండల్ రెడ్డికి, సూదిని పద్మారెడ్డికి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హై కోర్టు జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది.