Bed Wetting | సాధారణంగా పిల్లలు నిద్రలో మంచం తడిపేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాగే పిల్లల్లో మంచం తడిపే సమస్య (బెడ్ వెట్టింగ్) గురించి చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు ఇది వయసుతో అదే తగ్గిపోతుందని భావిస్తారు. కానీ వైద్య ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి, ఇది ఒక చికిత్స చేయగల ఆరోగ్య సమస్య. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు సంవత్సరాల పాటు మానసికంగా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. వైద్య పరంగా దీనిని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అని పిలుస్తారు. ఒక పిల్లవాడు ఆరు సంవత్సరాల వయస్సు దాటిన తరువాత కూడా వారానికి రెండు సార్లకు పైగా నిద్రలో మూత్ర విసర్జన చేస్తే, అది సాధారణం కాదు. ఈ దశలో ఇది కేవలం అలవాటు లేదా ప్రవర్తనా సమస్యగా కాకుండా వైద్య పరీక్ష అవసరమైన పరిస్థితిగా పరిగణించాలి.
బెడ్ వెట్టింగ్కు భావోద్వేగాలు, భయం, అలసత్వం కారణమని అనుకోవడం పెద్ద అపోహ. ఇది మానసిక సమస్య కాదు. దీనికి ప్రధాన కారణాలు రాత్రి సమయంలో ఎక్కువగా మూత్ర ఉత్పత్తి కావడం, మూత్రాశయం సామర్థ్యం తక్కువగా ఉండడం, కుటుంబ వారసత్వ ప్రభావం వంటి అంశాలు అని చెప్పవచ్చు. కొంతమంది పిల్లల్లో పగటి సమయంలో కూడా తరచూ మూత్రానికి వెళ్లడం లేదా లీకేజ్ కనిపించడం ద్వారా ఇది వైద్య సమస్య అని స్పష్టమవుతుంది. ఇంకా ఒక పెద్ద అపోహ ఏమిటంటే పుబర్టీ వచ్చిన తర్వాత ఈ సమస్య స్వయంగా తగ్గిపోతుందని భావించడం. ముఖ్యంగా అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభం అయిన తరువాత ఇది తగ్గిపోతుందని అనుకోవడం శాస్త్రీయంగా తప్పు. పుబర్టీతో ఈ సమస్యకు సంబంధం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికిత్సను ఆలస్యం చేయడం వల్ల సమస్య మరింత కాలం కొనసాగుతుంది.
ఈ సమస్య వల్ల ముఖ్యంగా టీనేజర్లలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారు. సిగ్గు, భయం, నమ్మకం తగ్గడం, స్నేహితులతో బయటకు వెళ్లకుండా ఉండడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది వారి వ్యక్తిత్వంపై కూడా దీర్ఘకాల ప్రభావం చూపిస్తుంది. అయితే మంచి విషయం ఏమిటంటే బెడ్‌వెట్టింగ్ పూర్తిగా చికిత్స చేయగల సమస్య. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదిస్తే 85-90 శాతం వరకు విజయవంతంగా నయం చేయవచ్చు. మూత్ర పరీక్షలు, బ్లాడర్ డైరీ, అవసరమైతే స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు.
ఈ సమస్యకు ముఖ్యంగా పిల్లల మూత్రపిండ నిపుణుడు (పెడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్) వద్ద చికిత్స పొందడం ఉత్తమం. ప్రత్యేకంగా బెడ్ వెట్టింగ్ క్లినిక్స్‌లో చికిత్స పొందితే మరింత సమర్థవంతంగా సమస్యను నియంత్రించవచ్చు. ఆరు సంవత్సరాల పైబడిన ప్రతి పిల్లవాడు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, అతనికి లేదా ఆమెకు సరైన వైద్య చికిత్స అందించడం తల్లిదండ్రుల బాధ్యత. సమయానికి చికిత్స తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా, నమ్మకంగా ఎదగడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.