JL Removed | ఇంటర్మీడియట్ విద్యాశాఖ (Intermidiate Education) సంచలన నిర్ణయం తీసుకుంది. 35 మంది జూనియర్ లెక్చరర్లను (JL) ఉద్యోగాలను నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరు నకిలీ పీజీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు పొందారని, వీరికి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సరైన సమాధానంతో రాలేదు. అందుకే వీరిని విధుల నుంచి తొలగిస్తున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. 2014 కంటే ముందునుంచే కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న సుమారు 3000కు పైగా మందిని 2023లో రెగ్యులరైజ్ చేశారు.
అయితే వీరిలో కొంతమంది ఇతర రాష్ట్రాల్లోని 16కు పైగా యూనివర్సిటీ (University)ల్లో చదివినట్లు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సర్టిఫికెట్లు ఒరిజినలా లేదా నకిలీవా అని తెలుసుకునేందుకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆ యూనివర్సిటీలను పరిశీలించారు. ఆ సర్టిఫికెట్లు నకిలీవి అని తేలడంతో వారికి ముందుగా నోటీసులు జారీ చేశారు. వాటికి సరైన సమాధానం రాకపోవడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరు రాష్ట్రంలోని రంగారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, నాగర్‌కర్నూలు, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, జగిత్యాలలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్నారు.