బీజింగ్ : ఏషియన్ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆర్చర్ హర్విందర్‌సింగ్ రెండు పసిడి పతకాలతో మెరిశాడు. ఆదివారంతో ముగిసిన టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు సహా మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో సత్తాచాటగా, చైనా(10 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) అగ్రస్థానం దక్కించుకుంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ టీమ్ ఈవెంట్లో భావనతో కలిసి స్వర్ణం సొంతం చేసుకున్న ప్రపంచ నంబర్‌వన్ హర్విందర్‌సింగ్..ఆదివారం జరిగిన రికర్వ్ ఓపెన్ విభాగంలోనూ పసిడి దక్కించుకున్నాడు.
పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హర్విందర్ 7-1తో హనెరుచై నెత్రీ(థాయ్‌లాండ్)పై అద్భుత విజయం సాధించాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ టీమ్‌ఈవెంట్‌లో శీతల్‌దేవి, జ్యోతి జోడీ 148-143తో చైనా ద్వయం లుజాంగ్, జింగ్ జావోపై గెలిచి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు జరిగిన పురుషుల రికర్వ్ డబుల్స్‌లో హర్విందర్, వివేక్ చికార జోడీ రజతం కైవసం చేసుకోగా, కాంపౌండ్ ఓపెన్ డబుల్స్లోరాకేశ్కుమార్, శ్యామ్‌సుందర్ ద్వయం మరో వెండి పతకాన్ని దక్కించుకుంది.