Harish Rao : తమ పంటలను కాపాడుకోవడం కోసం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని, అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
కళ్ల ముందే ఎండుతున్న పంటలకు నీరివ్వమని అడిగిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటని హరీష్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. వారి చేతగానితనంవల్ల పంటలకు నీరందకపోతే కడుపు మండి నిలదీసిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తారా..? అని ప్రశ్నించారు.
కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి, ఇప్పుడు రైతులను శిక్షిస్తున్నారని హరీష్రావు ఆరోపించారు. ఇది ప్రజా పాలన కాదని, ప్రజా పీడన అని విమర్శించారు. తప్పు ప్రభుత్వం చేస్తే శిక్ష రైతులు అనుభవించాలా..? అని నిలదీశారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హరీష్రావు హెచ్చరించారు.
కండ్ల ముందే ఎండుతున్న పంటలకు జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన బాట పట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య.
@revanth_anumula పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారడం సిగ్గుచేటు.
ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.
మీ చేతగాని తనం వల్ల ఈరోజు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్న దుస్థితి.
కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తారా?
పోలీసులను ప్రయోగించి భయబ్రాంతులకు గురి చేస్తారా? ఇదెక్కడి దుర్మార్గం? ఇదెక్కడి అన్యాయం?కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు.
నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు
తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా?సాగునీళ్లు లేక, కరెంట్ లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే.. పరిష్కరించాల్సింది పోయి అక్రమ కేసులు పెడతారా?
ఇది ప్రజా పాలననా? లేక ప్రజా పీడననా?
రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
@TelanganaCMO— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2026