Alias Rukmini | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు హీరోగా ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని మరోవైపు నిర్మాతగా వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘దండోరా’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళి కాంత్ దేవోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో, టాలీవుడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ను రేపు ఉదయం సరిగ్గా 10:08 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రపు గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ఇప్పుడు రాబోయే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, ఈ చిత్రంలో నితిన్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే దీనిపై కూడా చిత్ర బృందం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ‘యూనిసానిమస్ ప్రొడక్షన్స్’ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.