అప్పులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తున్నది కానీ, వాటిని రాష్ట్ర ఆస్తులుగా మార్చడంలో ఘోరంగా విఫలమైందని కాగ్ కుండబద్దలు కొట్టింది. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ మిగులున్న రాష్ట్రాన్ని, కాంగ్రెస్ ఒక ఏడాదిలోనే 9,420 కోట్ల లోటులోకి నెట్టింది. కాగ్ రిపోర్టుతో అయినా రేవంత్ కండ్లు తెరిచి ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలుకాలి.
– హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ): కాగ్ నివేదిక.. రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు లాంటిదని, తాము మొదటినుంచీ చెప్తున్నట్టే కాగ్ సాక్ష్యాధారాలతో నిరూపించిందని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అశాస్త్రీయంగా ఉన్నదో కాగ్ నివేదికలోని అంకెలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా వంటి విపత్తులు లేకపోయినా ఇంతటి లోటు ఏర్పడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. 2023-24లో 38,334 కోట్లుగా ఉన్న రుణాలను 2024-25 నాటికి రూ.56,209 కోట్లకు పెంచేశారని తెలిపారు. తెచ్చిన అప్పులను మౌలిక వసతులపై ఖర్చు చేయకుండా దారి మళ్లించారని, మిషన్ భగీరథ, కాళేశ్వరం, మెట్రో వాటర్ వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని నివేదిక స్పష్టం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలపై చూపిస్తున్నది కేవలం పెదవుల మీద ప్రేమేనని ధ్వజమెత్తారు. సోషల్ వెల్ఫేర్ కోసం రూ.25,971 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది రూ.9,721 కోట్లు(37%) మాత్రమేనని, వెనుకబడిన వర్గాలంటే కాంగ్రెస్‌కు ఎందుకంత చిన్నచూపు?’ అని నిలదీశారు. సోమవారం విడుదలైన 2024-25 ఆర్థిక సంవత్సర కాగ్ నివేదికలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బడ్జెట్ ఎస్టిమేట్స్ రూ.2,21,242 కోట్లు ఉంటే, యాక్చువల్స్(ఖర్చులు) రూ.1,67, 804 కోట్లు మాత్రమే ఉన్నాయని, అంటే బడ్జెట్ అంచనాల్లో చేరుకున్నది కేవలం 76శాతమేనని హరీశ్‌రావు తెలిపారు. ‘రెవెన్యూ వ్యయం అంచనాలు రూ.2,20,945 కోట్లు ఉంటే, వాస్తవ వ్యయాలు రూ.1,77,224 కోట్లు. అంటే చేరుకున్నది 80 శాతం. మాది రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అనే భట్టి గారు దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? రెవెన్యూ డెఫిసిట్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరపతి దెబ్బతీసేలా రికార్డు స్థాయి డెఫిసిట్‌ను నమోదు చేసింది. 2014-15కు రెవెన్యూ మిగులు రూ.368 కోట్లు ఉంటే, 2023-24కు రూ.779 కోట్లకు పెంచింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25కి గాను రెవెన్యూ లోటును ఏకంగా రూ.9,420 కోట్లకు తీసుకువెళ్లింది. ఒక కరోనా సమయం తప్ప ఎన్నడూ రెవెన్యూ లోటు లేదు. మరి రాష్ట్రాన్ని ఎవరు దివాలా తీయించినట్టు అని నిలదీశారు.
ఏడు పద్దులు, రెండు అప్రాప్రియేషన్లలో కలిపి మొత్తం రూ.31,229 కోట్ల ఖర్చు అదనంగా జరిగినట్టు కాగ్ నివేదించిందని హరీశ్‌రావు తెలిపారు. బడ్జెట్లో ప్లాన్ చేసిన ఖర్చు ఒకటి.. అసలు ఖర్చు పూర్తిగా అదుపు తప్పిందని, ఆర్థిక క్రమశిక్షణ లోపానికి, బడ్జెట్ ఇన్ ఎఫీషియెన్సీకి ఇది మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. బడ్జెట్లో రూ.40,453 కోట్లు పెట్టుకొని, రూ.50,978 కోట్లు ఖర్చు చేశారని, అంటే 10,525 కోట్ల అధిక వ్యయం(21శాతం) చేశారని విమర్శించారు. ‘ఒక ప్లాన్ అనేది ఉండదా? బడ్జెట్లో మీరే చెప్పి మీరే ఫాలో కారా? ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తరా? మీది ముమ్మాటికీ ఇన్ ఎఫీషియెన్సీ బడ్జెట్’ అని కాగ్ రిపోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం పరిధి అప్పుల విషయానికి వస్తే.. 2024-25కి గాను జీఎస్డీపీలో 32.80శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకొని వాస్తవానికి దానిని 34.29 శాతానికి పెంచి ప్రభుత్వం తను పెట్టుకున్న పరిమితిని తానే దాటి ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించిందని కాగ్ వెల్లడించిందని చెప్పారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో వ్యాపారం, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు ఇలా ఒకటి కాదు అన్ని రంగాలు కుదేలయ్యాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తద్వారా జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ, వాహన పన్నులు వంటి ఆదాయ వనరుల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపారు. ‘వెహికిల్ టాక్స్ 7,095 నుంచి 6,992 కోట్లకు తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్- రెవెన్యూ 14,296 కోట్ల నుంచి 8,473 కోట్లకు తగ్గింది. ఎస్వీటీఆర్ 1,11,798 కోట్ల నుంచి 1,09,233 కోట్లకు తగ్గింది. మొత్తంగా స్టేట్ ఓన్ రెవెన్యూ తగ్గింది. సొంత ఆదాయ వనరుల సమీకరణలో దారుణంగా విఫలమైందని కాగ్ రిపోర్టు స్పష్టం చేసింది. 2024-25లో జీఎస్డీపీ వృద్ధి 9శాతం మాత్రమేనని కాగ్ తేల్చి చెప్పింది. అంటే 2024-25 బడ్జెట్లో మీరు చెప్పిన వృద్ధి రేటు 10.6 శాతం అబద్ధమని కాగ్ రిపోర్టుతో వెల్లడైంది. ఇక మీరు చెప్పే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఓ బూటకమని తేలిపోయింది. 2034నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తాం. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్తాం అని గొప్పలు చెప్పారు. ఇది సాధ్యపడాలంటే.. వచ్చే ఎనిమిదేండ్ల పాటు ఏటా వరుసగా 20.7 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చొప్పున వృద్ధి సాధించాలి. కాగ్ రిపోర్టు ప్ర కారం, మీరు సాధించిన 9శాతం వృద్ధి రేటుతో వన్ ట్రిలియన్ డాలర్ అసాధ్యం. 2023-24లో 38,334 కోట్లుగా ఉన్న రుణాలను 2024-25 నాటికి 56,209 కోట్లకు పెంచారని, గతంలో ఎన్నడూ లేనంతగా అప్పులు తీసుకున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ‘అప్పులు తెచ్చి ఆరు గ్యారంటీలను అమలు చెయ్యలేని అసమర్థ సరార్ ఇది అని కాగ్ పరోక్షంగా తప్పుపట్టింది. ఇకనైనా పిచ్చికూతలు మాని ప్రజల కోసం పనిచేయాలని హరీశ్ కోరారు.
రెండేండ్ల్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. సాగునీటి రంగాలకు ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా విఫలమైన అంశాన్ని కాగ్ తప్పుపట్టిందని తెలిపారు. మాటలు మూరెడు -చేతలు చారెడు కూడా లేవని ఈ చేవలేని సరార్కు కాగ్ అక్షింతలు వేసిందని తెలిపారు. అంచనాలు, చేస్తున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదని, ప్రభుత్వ బడ్జెట్ ఎంత అన్ రియలిస్టిక్? ఎంత అన్ప్లాన్డ్గా ఉందో తాము చెప్పడం కాదు.. కాగ్ రిపోర్టుతో తేటతెల్లమైందని విమర్శించారు.