హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి.. ఒక ప్రకటన చేసినప్పుడు ఎంత హుందాగా.. ఎంత కచ్చితంగా మాట్లాడాలో.. కిషన్‌రెడ్డికి ఎంతమాత్రం పట్టడం లేదు. తనకు ఏది తోస్తే అది మాట్లాడేయడం.. వాస్తవం బయటపడేసరికి నాలుక్కరుచుకోవడం.. మళ్లీ తెల్లారే నాలుక మడతేయడం అలవాటైంది. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాలుక మళ్లీ మర్లబడింది. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఎయిమ్స్ విషయంలో అదే పనిగా తప్పుడు ప్రచారంచేస్తున్నారని పేర్కొన్నారు. ‘అబద్ధాలు ఆడను’ అంటూనే వాస్తవాలు వక్రీకరించి రోజుకో తీరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు రోజుల కిందట ఎయిమ్స్‌కు భూమి ఇవ్వలేదని ఆరోపించారని గుర్తుచేశారు. భూమిని అప్పగించినట్టు సంబంధిత పత్రాలను చూపెట్టగానే.. ఇప్పుడు భవనాలకు క్లియరెన్సులు ఇవ్వలేదంటూ కొత్తపాట ఎత్తుకున్నారని విమర్శించారు. కిషన్‌రెడ్డి శనివారం మీడియా సమావేశంలో ఆడిన అబద్ధాలను మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో సహా ఎండగట్టారు. అంశాలవారీగా వాస్తవాలను వెల్లడించారు.
కిషన్‌రెడ్డి వక్రీకరణ: బీబీనగర్ ఎయిమ్స్ భవనాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్సు వంటి అనుమతులు లేవు.ఈ విషయంపై కేంద్రం లేఖ రాసింది.
ఇదీ వాస్తవం: ఎయిమ్స్ భవనాలకు అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచే ప్రారంభించింది. ఇదే విషయమై అక్టోబర్ 9న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కేంద్రం లేఖ రాసింది. వెంటనే ప్రభుత్వం స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి 21న ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ (టీవోఆర్) ఇచ్చేలా కృషి చేసింది. టీవోఆర్ నంబర్ – SEIAA/TS/OL/YDR -130/2021.
కిషన్‌రెడ్డి వక్రీకరణ: తెలంగాణ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా భూమిని అప్పగించాలి.
ఇదీ వాస్తవం: తెలంగాణలో ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠపరచడంలో భాగంగా రాష్ర్టానికి ఎయిమ్స్‌ను కేటాయించాలని సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. మంజూరుకాగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 201 ఎకరాల భూమిని ఎయిమ్స్‌కు కేటాయించారు. దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే ప్రజల ముందుంచాం.
కిషన్‌రెడ్డి వక్రీకరణ: ఎయిమ్స్ భవనాల నిర్మాణం వైఎస్సార్ హయాంలో జరిగింది. తెలంగాణ వచ్చాక కట్టలేదు.
ఇదీ వాస్తవం: నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా బీబీనగర్‌లో క్యాంపస్ నిర్మించాలని నిర్ణయించారు. వైఎస్ హయాంలో పాక్షికంగా మాత్రమే నిర్మాణాలు జరిగాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రూ.45 కోట్లు ఖర్చు చేసి ఆ భవనాలను పూర్తిచేసింది. దవాఖానను వినియోగంలోకి తెచ్చింది. ఓపీ, డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించింది. 2017 మే 10న జీవో నెం.443 ద్వారా రూ.5 కోట్లు, అదే ఏడాది అక్టోబర్ 12న జీవో నెంబర్-632 ద్వారా రూ.40 కోట్లు విడుదల చేసింది. 2017 నవంబర్ 28వ తేదీన జీవో నెం.176 ద్వారా 258 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సైతం ఇచ్చింది. ఇతర రాష్ర్టాల్లో భవన నిర్మాణానికి రెండుమూడేండ్ల సమయం పట్టడం వల్ల అక్కడ తరగతులు ప్రారంభించడంలో ఆలస్యమైంది. తెలంగాణలో మాత్రం నిమ్స్ కోసం నిర్మించిన భవన సముదాయాలను ఎయిమ్స్‌కు బదిలీ చేయడం వల్ల వెనువెంటనే తరగతులు ప్రారంభమయ్యాయి.
కిషన్‌రెడ్డి వక్రీకరణ: నూతన మెడికల్ కాలేజీలవిషయంలో తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు.
ఇదీ వాస్తవం: తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రులుగా వ్యవహరించిన నడ్డా, హర్షవర్ధన్‌కు పలుమార్లు విన్నవించింది. తాజాగా కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. ఫేజ్-1, ఫేజ్-2 లలో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు. ఫేజ్-3లో ఉన్న నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేకుండా చేశారు.