Harish Rao | సంగారెడ్డి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డీ.. నువ్ ముఖ్యమంత్రివా.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని డప్పూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఫార్మాసిటీలో కోల్పోతున్న రైతుల భూములను హరీశ్‌రావు పరిశీలించారు. అనంతరం ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న డప్పూరు, వడ్డి, మాల్గి రైతులతో సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మూడు పంటలు పండే బంగారంలాంటి మా భూములను ఫార్మాసిటీకి ఇవ్వబోమని, అవసరమైతే ప్రాణాలిస్తామని రైతులు, మహిళలు కంటతడి పెట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ గరీబీ హటావో అంటే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో గరీబ్, కిసాన్ హటావో అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హైదరాబాద్ సమీపంలో ఫార్మాసిటీ కోసం 15వేలు ఎకరాలు సేకరించటంతో పాటు అన్ని అనుమతులు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
అక్కడ ఫార్మాసిటీ నిర్మించకుండా ఆ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముకుని డబ్బు చేసుకోవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. న్యాల్కల్ మండలంలోని డప్పూరు, వడ్డి, మాల్గి గ్రామాల్లో ఫార్మాసిటీ పేరిట బంగారంలాంటి రెండువేల ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవటం దారుణమన్నారు. అసైన్డ్‌భూములున్న రైతులకు పట్టాలిస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ హామీ ఇచ్చి ప్రజల నుంచి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఇప్పుడు న్యాల్కల్ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌రెడ్డి పాలన మారిందని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే బీఆర్ఎస్ చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. భూసేకరణ కోసం జేసీబీలు, పొక్లెయిన్లు వస్తే తనతోపాటు ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి డప్పూరులోనే మకాంవేసి భూసేకరణను అడ్డుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు మాత్రం ఒక్కమాటమీద ఉండాలని, బ్రోక్లర్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. కోహీర్ జామ, డప్పూరు పుదీన అంటే బోయిన్పల్లి మార్కెట్, బీదర్‌లో ఫేమస్ అని గుర్తు చేశారు. మూడు గ్రామాల రైతులు ఏకమై పోరాడితే ఫార్మాసిటీ రద్దవడం ఖాయమని సూచించారు.
అయ్యా.. ఈ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం మా భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నది. సారవంతమైన భూములను సర్కారుకు ఇచ్చి మేమెట్ల బతకాలే. ఫార్మాసిటీ వస్తే నీళ్లు కలుషితమైతయి..మా ఆరోగ్యాలు దెబ్బతింటయి..మాకు అండగా నిలవాల్సిన సర్కారే.. ఇలా ఇబ్బంది పెడితే మా జీవితాలు ఏం కావాలే. ప్రాణాలైన ఇస్తం..కానీ మూడు పంటలు పండే ఈ భూముల్ని వదులుకోం..
మూసీని శుద్ధ్దిచేసి గోదావరి జలాలు కలుపుతామంటున్న రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ కంపెనీలతో మంజీర నదిని విషతుల్యం చేస్త్తవా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. పాలలాంటి మంజీరా నీళ్లలో విషం కలుపుతవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషితమైన మంజీర నీటిని హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎలా తాగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫార్మాసిటీ భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ డప్పూరులో చెరువులు తవ్వించటంతోపాటు కొత్తగా సబ్‌స్టేషన్ నిర్మిస్తే రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల భూములు లాక్కుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తే సహించేదిలేదన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, మాణిక్యం, బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, హకీం, నరహరిరెడ్డి, వీరారెడ్డి, మాజీ సర్పంచ్ రవి పాల్గొన్నారు.
ఫార్మాసిటీలో రైతులు కోల్పోతున్న భూములను మాజీ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో వచ్చిన హరీష్‌రావుకు బీఆర్ఎస్ నాయకులు, డప్పూరు, వడ్డి, మాల్గి గ్రామాల రైతులు ఘన స్వాగతం పలికారు. అక్కడ పత్తి, కంది, చెరుకు, పుదీనా తదితర పంటలను చూశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సర్ నాపేరు శరణమ్మ, నాకు రెండెకరాల భూమి ఉంది. వారసత్వంగా వచ్చిన ఈ భూమిని ఏళ్లుగా సాగు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న. పొలం కాడ బావి ఉంది. మూడు పంటలు పండిస్తా. పత్తి, చెరుకు, పుదీనా పంట వేస్త. ఏడాదికి రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం మా భూములు లాక్కుంటమని అంటున్నది. ప్రాణమైనా ఇస్తం కానీ భూములు మాత్రం ఇయ్యం.
మీకు రైతుబంధు వస్తుందా అమ్మా?
శరణమ్మ: లేదు సార్ ఇప్పటి వరకు రైతుబంధు పడలేదు. కేసీఆర్ సర్కార్‌లో ఏటా రెండుమార్లు టైంకు రైతుబంధు డబ్బులు పడ్డయి. పింఛన్ డబ్బులు ఠంచన్‌గా వచ్చినయి. రేవంత్‌రెడ్డి వచ్చాక మా రైతుల ఉసురుతీస్తుండు సర్.
సర్ నాపేరు లక్ష్మి. నాకున్న రెండెకరాలూ ఫార్మాసిటీలో పోతున్నది. మూడు పంటలు పండేవి. మేం పుదీనా వేసినం. మంచి ఆదాయం వస్తున్నది. మాకున్న ఆధారమే ఈ భూమి. ప్రాణాలు పోయినా ఫార్మాసిటీకి భూములియ్యం.
హరీశ్‌రావు: అధైర్యపడకండి.. మీకు అండగా నేనుంట. మీ అనుమతి లేకుండా ఫార్మాసిటీకి భూములు పోనివ్వ.
సర్ నాపేరు లలిత. మా కుటుంబానికి ఇక్కడ రెండెకరాలు ఉంది. పుదీనా, ఇతర పంటలు వేస్తం. ఏడాదికి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తం. మా జీవనాధారాన్ని లాక్కుంటమంటే మేం ఎట్ల బతకాలే.
హరీశ్‌రావు: అమ్మా..మీ భూములు ఎక్కడికీ పోవు. మేం అండగా ఉంటం. మీరే కాదు. డప్పూరు, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు ఎవ్వరూ అధైర్యపడొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఉంది. అవసరమైతే న్యాయపోరాటం చేస్తం.
సారవంతమైన భూములు పోతే మేమెట్ల బతుకుతం. జీవనాధారమైన భూములను ఫార్మాసిటీకి లాక్కుంటే కుటుంబమంతా రోడ్టునా పడాలా. మాకున్న రెండెకరాల భూమిల ఏడాది పొడవున పుదీనాను సాగు చేసుకుంటున్నం. ప్రాణాలు పోయినా ఫార్మాసిటీకి మాత్రం భూములు ఇవ్వం.
మా నాయన నుంచి నాకు ఐదెకరాల భూమి అచ్చింది. రూపాయి రూపాయి కూడబెట్టి, చెమట దారబోసి, బావితవ్వించిన. ఇప్పుడు నాభూమి లాక్కుంటమంటే నిద్రపడుతలేదు. ఈ భూమిలో పంటలు తీసి ఇద్దరు కొడుకులు, బిడ్డ లగ్గం జేసిన. ఇప్పుడు పొలాన్ని రేవంత్‌రెడ్డి లాక్కుంటుంటంటే కడుపు మండుతున్నది. మేము వేసిన రొట్టె తునక తోని రేవంత్‌రెడ్డి బతుకుతుండు. మారొట్టె తిని మమ్మల్ని తరుముతున్నడు. రేవంత్‌రెడ్డి ఇది ఇస్తా అది ఇస్తా అని మాయజేసిండు. ఇప్పుడు మమ్ముల్ని మోసం చేస్తుండు. ఫార్మా కంపెనీలకు భూములియ్యం.