వరంగల్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో రేవంత్ పాలనతో బడులే కాదు…గుడులు కూడా విధ్వంసానికి గుర వుతున్నాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘రేవంత్‌రెడ్డికి బడులంటే పట్టవు.. గుడులు అంటే లెక్క లేదు’ అని మండిపడ్డారు. కేసీఆర్ ఆలయాలను నిర్మించి వాటి పవిత్రతను ప్రపంచానికి చాటితే రేవంత్‌రెడ్డి ఏకంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్మండలం అశోక్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కూల్చివేసిన కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం శిథిల శకలాలను క్షేత్రస్థాయిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, శంకర్‌నాయక్, అరూరి రమేశ్ , రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నేతలు మర్రి యాదవరెడ్డి, తక్కపల్లి రవీందర్రావు తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
బడులను బాగు చేయాలని కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ ప్రారంభిస్తే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని రద్దు చేశారని, తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదని విమర్శించారు. అశోక్‌నగర్ ఆలయ విధ్వంసం అంతా రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్టు ప్రజలు భావిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి, బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొప్ప చారిత్రక, వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఆలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లంకె బిందెలు దొరుకుతాయనే కాకతీయులు నిర్మించిన పురాతన దేవాలయాన్ని కూల్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌లో దేవాదాయ పరిధిలోని భూమి ఇప్పుడు ఉన్నపళంగా భూభారతిలో ప్రభుత్వ భూమిగా ఎట్లా మారిందో చెప్పాలని నిలదీశారు.