హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. నీటి కేటాయింపులు లేకున్నా, వరద జలాలు రాకున్నా, ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ తీరును సోమవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం మన నీటి హకులపై దండెత్తి నీటిని అడ్డగోలుగా తరలిస్తున్నదని ధ్వజమెత్తారు.
ఒకవైపు కృష్ణా బేసిన్లో భాగమైన భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్లు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ సర్కార్ నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలిస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాలువ.. ఇప్పుడు వెలిగొండ. తెలంగాణకు దకాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు? పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది.
ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కేఆర్ఎంబీ సైతం పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే.. రాష్ట్ర నీటి హకులను ఎవరు కాపాడాలి? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే స్పందించాలి. కేఆర్ఎంబీపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.