12లక్షల ఎకరాల్లో పంట నష్టం
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో గురువారం ఎండిన వరి పొలాలను రైతులతో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన పంటలు, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
- రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా..
- కాంగ్రెస్ మొద్దునిద్ర నీరో చక్రవర్తిలా ముఖ్యమంత్రి రేవంత్ తీరు
- తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి
- దేవాదుల, కల్వకుర్తి మోటర్లు 24గంటలు నడుపాలి
- అధికారులపై చిందులేస్తే రైతుల బాధలు తీరవు
- సీఎం, విద్యుత్ శాఖ మంత్రిని సస్పెండ్ చేయాలి
- రైతు కూలీలకు రూ.12వేల సాయం ఇవ్వాలి
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్ డిమాండ్
గజ్వేల్, అక్టోబర్ 22 : కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో గురువారం ఎండిన వరి పొలాలను రైతులతో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన పంటలు, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్ నినో వస్తుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు ముందే చెప్పినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ కొనుగోళ్లు చేయకుండా చేతులు కాలాక అధికారులపై చిందులేస్తే రైతుల బాధలు తీరవంటూ నిప్పులుచెరిగారు.
ఆ అధికారులను కాదు.. అసమర్థ సీఎం, విద్యుత్ శాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పొరుగున మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్షణ సాయంగా ఎకరాకు రూ.5వేలు విడుదల చేసిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిందని, మరికొన్ని రాష్ర్టాలు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు నిధులు విడుదల చేశాయని హరీశ్‌రావు తెలిపారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కరువు మండలాలు ప్రకటించలేదని మండిపడ్డారు.
సమస్య నెత్తిమీదికి వచ్చాక నిన్న యాదాద్రి ఐదో యూనిట్‌ను సింక్రనైజ్ చేశారని, ఈ పని ముందే చేసి ఉంటే పంటలు ఎండేవి కావని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించి ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12వేలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు కాలంలో ప్రజలపై రూ. 5,420కోట్ల కరెంట్ బిల్లుల భారం, ఆర్టీసీ చార్జీల పెంపు దుర్మార్గమని, పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సాగునీళ్లు, కరెంట్ ఇవ్వడంలో ఘోర వైఫల్యం
కొందామంటే కరెంట్ దొరుకడం లేదు, నీళ్లను కొనలేమని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి ముందస్తుగా పీపీఏలు చేసుకొని బొగ్గు నిల్వలు సమకూర్చితే ఇవాళ రైతులకు ఈ పరిస్థితి వచ్చేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రేవంత్‌వి బీద అరుపులని, కరోనా కాలంలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పి తామున్నామనే విశ్వాసం కల్పించారని గుర్తుచేశారు. కరోనా విపత్తులో కోటి టన్నుల పంట పండిస్తే ఎల్ నినో సాకుతో రేవంత్‌రెడ్డి క్రాప్ హాలిడే ప్రకటించి రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయకుండా, దేవాదుల, కల్వకుర్తి మోటర్లును 24గంటలు నడుపకుండా సాగునీటి కరువు సృష్టించారని విమర్శించారు. ఇవాళ సీఎం సొంత జిల్లా పాలమూరు కరువుకు ఎల్ నినో కారణం కాదని రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యమే కారణమని నిప్పులు చెరిగారు. కన్నెపల్లి, దేవాదుల కల్వకుర్తి మోటర్లను తక్షణమే 24గంటల పాటు నడిపించాలని డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్లకు నిధులు ఇచ్చి ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భీం.. సాయన్న పోరాట స్ఫూర్తి ఆదర్శం: హరీశ్‌రావు
‘మా గూడెంలో మా రాజ్యం కావాలి..’ అనే నినాదంతో జల్, జంగిల్, జమీన్ కోసం జీవితాన్ని ధారబోసిన ఆదివాసీ యోధుడు కుమ్రం భీం, అన్యాయంపై తిరుగబడి, నిరుపేదల పక్షాన నిలిచిన బహుజన వీరుడు పండుగ సాయన్నల పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. మహనీయుల జయంతి సందర్భంగా గురువారం ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కుమ్రం భీం ఆత్మగౌరవ భవనం నిర్మించడంతోపాటు, వారి జయంతిని అధికారికంగా నిర్వహించి సముచిత గౌరవమిచ్చినట్టు చెప్పారు. సాయన్న పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పునరుద్ఘాటించారు. వారి ఆశయసాధనకు కృషిచేయాలని సూచించారు.
పంట ఎండింది.. పురుగుల మందే దిక్కయ్యింది!
- పొలంలోనే తాగేందుకు ప్రయత్నించిన రైతు సత్తయ్య
- డబ్బా గుంజుకొని రైతుకు ధైర్యం చెప్పిన హరీశ్‌రావు
- బూరుగుపల్లిలో రైతుల కష్టాలు విని చలించిన మాజీ మంత్రి
గజ్వేల్, అక్టోబర్ 22 : తాను సాగు చేసిన పంట అంతా ఎండిపోయిందని, ఇక పురుగుల మందు తాగి చావడం తప్ప మరో గత్యంతరం లేదని రైతు దేవునూరి సత్తయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. గజ్వేల్ మండలం బూరుగుపల్లికి వచ్చిన హరీశ్‌రావుకు ఎండిపోయిన పొలాన్ని చూపిస్తూ కష్టాలు చెప్పుకొన్నారు. ఆ వెంటనే పొలం వద్దే పురుగుల మందు తాగబోయిన ఆ రైతును హరీశ్‌రావు అడ్డుకొని డబ్బా గుంజుకొని ధైర్యం చెప్పారు. అదే విధంగా మరికొందరు రైతుల బాధలు కూడా విని హరీశ్‌రావు చలించారు.
మూడెకరాల్లో వరి సాగు చేస్తే పొలాన్ని కాపాడుకోవడానికి కరెంట్ లేక రోజుకు జనరేటర్ కిరాయికి రూ.4వేలు, రూ.3వేలు డీజిల్‌కు కలిపి రోజుకు రూ.7వేల చొప్పున మూడు రోజులు రూ.21వేలు ఖర్చు పెట్టానని, పంటను వదిలేస్తే 2.5 ఎకరాలు ఎండిపోయి కేవలం అర ఎకరం మాత్రమే మిగిలిందని యువ రైతు అరవింద్‌రెడ్డి వాపోయాడు. మూడెకరాల్లో నాటేస్తే రెండు ఎకరాల 30గుంటలు పొలం ఎండిపోయిందని, కేవలం 10గుంటలు మాత్రమే మిగిలిందని మరో రైతు మినుముల స్వామి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లాడు. రిమ్మనగూడకు చెందిన రైతు దయ్యాల యాదగిరి పదెకరాల్లో వరిసాగు చేస్తే 9ఎకరాలకు పైగా ఎండిపోయిందని హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.
కుమ్మరి సత్యనారాయణ ఆరు ఎకరాల్లో నాటేస్తే మూడెకరాలు ఎండిపోయిందని, లో-వోల్టేజీ, టూ ఫేజ్ కరెంట్‌తో స్టార్టర్‌లో పత్తులు కొట్టుకుంటూ రెండు సార్లు మోటర్లు, ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రూ.10వేల చొప్పున నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. బూరుగుపల్లి పరిసరాల్లో వందలాది ఎకరాల్లో పొట్ట దశకు వచ్చిన వరి మరో 20రోజుల్లో కోతకు వచ్చే సమయంలో నీళ్లు లేక కరెంట్ లేక నోటికాడి బుక్క మట్టిపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో యాసంగి, వానకాలంలో బంగారంలా పంటలు పండాయని, ఇప్పుడు వానకాలంలో నీళ్లు లేకపోవడం ఇదే మొదటిసారని రైతులు వాపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- crop failure
- drought
- El Nino
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

