వరంగల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ దెబ్బతో రేవంత్ సర్కార్‌కు దిమ్మతిరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణిలో పుట్టిచ్చిన అగ్గికి హడలిపోయిన సర్కార్ సింగరేణి కార్మికులతో కాళ్ల బేరానికి వస్తున్నదని చెప్పారు. సింగరేణి తెలంగాణ మాగాణం అని, రాష్ట్రం కోసం ఉద్యమించిన బిడ్డలుగా, సింగరేణిని ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టామని స్పష్టంచేశారు. గోదావరిఖని నుంచి సింగరేణి బాట పట్టిన బీఆర్ఎస్ జడుపునకు బెదిరిపోయి, పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉన్నదని గ్రహించిన సర్కార్ కార్మికులను దగ్గర చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని, అందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని తెలిపారు.
ఇది సింగరేణి కార్మికులు, బీఆర్ఎస్ సాధించిన విజయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ సారథ్యంలో సాగిన పోరాటాల స్ఫూర్తితో సింగరేణి రక్షణకు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ చర్యలను బీఆర్ఎస్ ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే సింగరేణి స్కామ్‌లపై సీబీఐ విచారణ చేయాలని సవాల్ విసిరారు. శుక్రవారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సింగరేణిలో రేవంత్ సర్కార్ అవినీతి బాగోతాలపై పవర్ పాయింట్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ఎండగట్టారు. రేవంత్ సర్కార్ సింగరేణిని ఎట్లా నష్టాల్లోకి నెడుతున్నదో అంశాల వారీగా వివరించారు. సోలార్ పవర్, బొగ్గు స్కామ్, సైట్ విజిట్ సామ్, జైపూర్ పవర్ సామ్, 40లక్షల బొగ్గు మాయం సామ్, ఎక్సప్లోజివ్ సామ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల దాకా హరీశ్‌రావు చేసిన పీపీటీనీ సింగరేణి కార్మికులకు ఆసక్తిగా విన్నారు. సమావేశానికి కార్మికుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ముందే గ్రహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హాల్ బయట భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
కేసీఆర్ హయాంలో లాభాల బాటలో నడిచి, ఫిక్స్డ్ డిపాజిట్లతో కలకల లాడిన సింగరేణిని అప్పులు ఊబిలోకి నెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి సర్కారుకే దక్కింది.
-హరీశ్‌రావు

సింగరేణిని కాపాడాలంటే అవినీతిపై వెంటనే సీబీఐ విచారణ, సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరుపాలని, లేదంటే ఆ అవినీతి అక్రమాల్లో బీజేపీకి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భాగస్వామ్యం ఉన్నదని నమ్మాల్సి వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ కో హఠావో..సింగరేణి బచావో’ అనే నినాదమే ఇప్పుడు సింగరేణి విధానం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలను విడిచిపెట్టబోమని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంతా కక్కిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలోని మట్టిని, ఇసుకను, బట్టలు, బూట్లు ఇలా అన్నింట్లో అవినీతి మయం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఉద్యమ పార్టీగా, తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీగా సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉన్నదని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో 16,500 మంది కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ కారుణ్య నియామకాలపై విచారణ జరిపి, వాటిని ఊడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ ప్రయత్నం చేసిందని మండిపడ్డారు.
కోల్ ఇండియాలో, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో ఎక్కడాలేని సైట్విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని ప్రవేశపెట్టి తద్వారా తన బామమరిది సృజన్‌రెడ్డికి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర లు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. వెంకటేశ్ ఖనిలో రేవంత్ బావమరిది శోధా కన్సస్ట్రక్షన్స్కు ఎక్సెస్ (ప్లస్) 13%తో టెండర్ దకిన మాట నిజం కాదా? ఒక శోధా టెండర్లోనే దాదాపు సింగరేణికి రూ.50 కోట్లు నష్టం వాటిల్లింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మైనస్ పోయిన ఓబీ టెండర్లు, రేవంత్ రాగానే ఎక్సెస్ ఎందుకు పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఓసీ టెండర్‌ను ఏడుసార్లు వాయి దా వేశారని, కమీషన్లు కుదరడంలేదని, రేవంత్ బావమరిది వాయిదా వేయించిన మాట నిజం కాదా? అని నిలదీశారు. సింగరేణిలో అవినీతి బాగోతాన్ని బీఆర్ఎస్ బయటపెట్టగానే రూ. 600 కోట్ల టెండర్ మైనస్ 12కు పోయి, సింగరేణి సొమ్ము ఆదా అయిందని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం సోలార్ ప్లాంట్లు మొదలుపెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. ఇతరులెవరూ టెండర్లో పాల్గొనకుండా దుర్మార్గంగా నియమ నిబంధనలు మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క మెగావాట్‌కు రూ.3 కోట్లు ఖర్చయితే రూ.7 కోట్లకు టెండర్లు ఇచ్చారని ఉదహరించారు. 67 మెగావాట్ల ప్లాంట్‌ను అదనంగా రూ.250 కోట్లు కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారని, 107 మెగావాట్ ప్లాంట్ విషయంలో మెగావాట్‌కు రూ.5.4 కోట్లకు, ఈ లెక్కన రూ.540 కోట్లను అప్పనంగా కట్టబెట్టారని మండిపడ్డారు. రూ.480 కోట్లతో 67 మెగావాట్ల ప్లాంట్ కట్టి రెండేండ్లు అవుతున్నా దానికి సింక్రనైజ్ చేయలేదని, పీపీఏ లేక నిరుపయోగంగా మారిపోయిందని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో వారం వారం మెడికల్ బోర్డు పెట్టి, 16,500 కారుణ్య నియామకాలు ఇచ్చారు. సింగరేణిలో మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దే.
-హరీశ్‌రావు
పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) లేకుండానే జైపూర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. పవర్ సామ్‌కు జైపూర్ అద్భుతమైన ఉదాహరణ అని వివరించారు. దేశంలో ఎక్కడ ప్లాంట్ పెట్టినా పీపీఏ చేసుకోవాలని, అలాంటిది 800 మెగావాట్ల ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ, డీపీఆర్ ఆమోదం లేకుండా ఏర్పాటుచేశారని, తమ అనుయాయులకు టెండర్లు కట్టబెట్టారని దీనిలో ఇప్పటికే రూ.1,000 కోట్లు ధారపోశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణిని శాశ్వతంగా చీకటి మయం చేయాలనే కాంగ్రెస్ కుట్రలను చూస్తూ ఊరుకోలేమని హెచ్చరించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో సింగరేణిలో ఎప్పుడైనా సైట్విజిట్ సర్టిఫికెట్ ఉందా? కేసీఆర్ హయాంలో మైనస్ పోయిన ఓబీ టెండర్లు, రేవంత్ రాగానే ఎక్సెస్ ఎందుకు పోయాయో సమాధానం చెప్పాలి.
-హరీశ్‌రావు
సింగరేణిలో బొగ్గు నిల్వల కుంభకోణం భారీ ఎత్తున సాగుతున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని తాను ఆధారాలతో బయటపెట్టగానే సర్కార్‌కు వణుకు మొదలైందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బాట పట్టగానే మట్టికుప్పలపై బొగ్గు పోసి నిల్వలు ఉన్నాయని బుకాయిస్తున్నదని ఆరోపించారు. ఒక్క భూపాలపల్లి బొగ్గు బాయి మీదే మూడు లక్షల టన్నుల బొగ్గు ఉన్నదని చెప్తున్నదని, దానిని చూసేందుకు తాము వెళ్తామంటే అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. బొగ్గు బావుల్లో వాడే జిలిటెన్ స్టిక్స్ కొనుగోళ్లల్లోనూ కాంగ్రెస్ సర్కార్ స్కామ్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ కుంభకోణాలతో సింగరేణిలో ఉత్పత్తి 58 మిలియన్ టన్నులకు తగ్గిందని ఉదహరించారు.
బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్‌కు దిమ్మ తిరిగిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కారుణ్య నియామకాలను సరళీకృతం చేస్తామని హామీ ఇచ్చి మొత్తానికి మొత్తమే బంద్ చేసిందని దుయ్యబట్టారు. వారం వారం మెడికల్ బోర్డు పెట్టి కేసీఆర్ 16,500 కారుణ్య నియామకాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్ సింగరేణిలో మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని వివరిస్తున్నప్పుడు సదస్సు ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది. కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.