భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,061 ఆయా పోస్టులకు గాను 1,001 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాదు జిల్లాలోని 11 అంగన్వాడీ ప్రాజెక్టుల్లో ఉన్న 2,061 అంగన్వాడీ కేంద్రాల్లో 185 టీచర్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో అంగన్వాడీ టీచర్లపై చాలా అదనపు భారం పడుతోంది. అటు బోధనతోపాటు వంటపని కూడా చేస్తున్నారు. అదనపు పనులు చేయలేక ఇప్పటికే ఎన్నోసార్లు టీచర్లు రోడ్డెక్కారు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. ఆ శాఖలోని ప్రాజెక్టు కార్యాలయాల్లో కూడా సిబ్బంది పోస్టులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మా హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా భర్తీ చేశాం.. ఇంకా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ కనీసం అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడం గమనార్హం.
గత రెండేళ్లుగా అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ నేటికీ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గత ఏడాది అంగన్వాడీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని పత్రికాముఖంగా ప్రకటన కూడా చేశారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఈ జూన్ నెలలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకు ఆ ఫైల్ కలెక్టరేట్ గడప దాటలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నా అది ఆచరణకు నోచుకోకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తున్నది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులతోపాటు ఆయా పోస్టులు భర్తీ చేయకపోవడంతో రెండు కేంద్రాలను ఒక్కరే టీచర్ చూడాల్సి వస్తున్నదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సమయానికి జీతాలు రాక, పెండింగ్లో ఉన్న గ్యాస్ బిల్లులు, వంట బిల్లులు రాకపోవడంతో టీచర్లు నానాపాట్లు పడుతున్నారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.

అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఇట్లా ఉంటే.. ఆ శాఖలోని ప్రాజెక్టు కార్యాలయాల్లో కూడా సిబ్బంది పోస్టులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. సాధారణ బదిలీల్లో భాగంగా 40 శాతం బదిలీల్లో ప్రతి ఒక్కరూ కోరుకున్న చోటుకు బదిలీ కావడంతో జిల్లా కేంద్ర కార్యాలయంలో ఒక్క సీనియర్ అసిస్టెంట్ పోస్టు కూడా భర్తీ కాలేదు. దీంతో ఆఫీసులో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. క్లియర్ కావాల్సిన పెండింగ్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చివరికి ఎల్డీసీ, టైపిస్టులు కూడా లేకపోవడం గమనార్హం. పర్యవేక్షణ చేయాల్సిన సూపర్వైజర్ పోస్టులు కూడా ఇంకా ఎనిమిది ఖాళీగా ఉన్నాయి.
సీడీపీవోలు 11 ప్రాజెక్టుల్లో చండ్రుగొండ ప్రాజెక్టు అధికారి పోస్టు ఖాళీగా ఉంది. సీనియర్ అసిస్టెంట్లు 13 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. 9 పోస్టులు ఖాళీ. గ్రేడ్-1 సూపర్వైజర్లు 43 మందికి 35 మంది ఉన్నారు. ఇంకా 8 ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్లు 20కి 16 మంది ఉన్నారు. టైపిస్టులు ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాలు 2,061 ఉండగా.. 1,876 మంది టీచర్లు ఉన్నారు. 185 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్పర్లు(ఆయాలు) 1,061 పోస్టులు ఉండాల్సి ఉండగా.. 1,001 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం. రెండురోజుల క్రితం ఫైల్ కూడా పెట్టాం. ఆయాల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల టీచర్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ఇటీవల సాధారణ బదిలీల్లో మా ఆఫీసులో కూడా సీనియర్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. త్వరలో ప్రమోషన్లు ఇస్తారు. అప్పుడు భర్తీ అవుతాయి.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం