కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 11 : ఇల్లటూరి హరీశ్ అనే వ్యక్తికి బీఆర్ఎస్వీతో ఎటువంటి అధికారిక సంబంధం లేదని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి ఆర్గనైజేషన్లో ఎప్పుడూ పని చేయలేదని, సంస్థలో ఎటువంటి అధికారిక బాధ్యతను నిర్వహించలేదని తెలిపారు. బీఆర్ఎస్వీ పేరును ఉపయోగిస్తూ కొత్తగూడెం పట్టణంలోని కొన్ని విద్యా సంస్థల వద్ద హడావిడి సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ, విద్యార్థుల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పని చేస్తున్న సంస్థ బీఆర్ఎస్వీ అని, సంస్థకు సంబంధం లేని వ్యక్తులు సంస్థ పేరు చెప్పుకుని విద్యాసంస్థల వద్ద కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం లేదా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. బీఆర్ఎస్వీ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా కార్యకలాపాలు నిర్వహించినా, అలాంటి వ్యక్తులకు సంస్థతో ఎటువంటి సంబంధం లేదని విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు.