దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీకగా నిలుస్తున్నది. దేశ నాగరికతకు చేనేత, ఖాదీవస్ర్తాలు నిలువెత్తు నిదర్శనం. కంచి, బనారస్, మైసూర్, పోచంపల్లి, ఛందేరి, ఫైదానీ, కశ్మీర్, బెంగాల్, ఒడిశా, రాజస్థాన్, సంబల్పూర్, చీరాల, మంగళగిరి మొదలైన చీరలు, ఇతర వస్ర్తాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి.
భారతీయ అస్తిత్వంలో చేనేత రంగానికి విశిష్ట స్థానం ఉన్నది. జాతీయోద్యమ కాలంలోనూ చేనేత, ఖాదీ వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయినాయి. భారతీయ వస్ర్తాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ, పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇక్కడి నేతన్నల నైపుణ్యం వేనోళ్ళతో కొనియాడబడింది. నేటికి ముప్పై లక్షల చేనేత మగ్గాల మీద కోటి మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. ప్రకృతికి అనుకూలంగా, తక్కువ పెట్టుబడితో, విద్యుత్ లేకుండా కాటన్, పట్టు దారాలతో బట్టలు నేసే చేనేతరంగం ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నది. దేశంలోని మొత్తం వస్త్ర పరిశ్రమలో మిల్లులు, మరమగ్గాలు 90 శాతం ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటే చేనేతరంగం వాటా పది శాతమే. అయినా భారత ప్రభుత్వం చేనేత పరిశ్రమ పునరుద్ధరణకు, అభివృద్ధికి కృషిచేయటం లేదు. గడిచిన దశాబ్దకాలంగా ప్రభుత్వ విధానాల వల్ల 13 లక్షల చేనేత మగ్గాలు మూతపడ్డాయి. సరైన బడ్జెట్ కేటాయింపుల్లేకపోవడం, జీఎస్టీ 5 శాతం విధించటంతోపాటు రెండేండ్లుగా కరోనా సంక్షోభంతో చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి.
చేనేత పట్ల మోదీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. బీజేపీ, లోకల్ టు గ్లోబల్ అనే నినాదం చేస్తూ జాతీయ చేనేత దినోత్సవాలు జరుపుతున్నది. ‘ఆత్మనిర్భర భారత్’ సాధనే తమ లక్ష్యమని చెప్తున్నది. కానీ 2022 జనవరి 1 నుంచి చేనేత వస్ర్తాలపై జీఎస్టీ పన్నును 5 నుండి 12 శాతానికి పెంచింది. చేనేత రంగానికి ఈ జీఎస్టీ పెంపు ఆశనిపాతంగా మారుతుంది. సాధారణంగానే చేనేత వస్ర్తాల ధరలు ఎక్కువగా ఉంటాయి. మిల్లులు, మరమగ్గాల పోటీని తట్టుకొని నిలబడుతున్న చేనేత ఒక కళారంగం. ఒక పోచంపల్లి పట్టుచీర నేయడానికి ఒక కుటుంబం వారం రోజులు శ్రమించాల్సి ఉంటుంది. కానీ మిల్లులు రోజుకు వందలాది చీరలు తయారుచేయడంతో ఉత్పత్తి ధర తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో చేనేతరంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు రాయితీలు కల్పించాలి. కానీ 2017లో జీఎస్టీని 5 శాతం విధించడం వల్ల దేశంలోని చేనేత కార్మికులు తమవృత్తిని వదిలి పట్టణాలకు వలసపోయారు. కళాకారులు నైపుణ్యం లేని రంగాల్లో పనిచేస్తున్నారు.ఒకవైపు ‘నైపుణ్య భారత్’ నినాదం తలకెత్తుకున్న మోదీ ప్రభుత్వం ‘నైపుణ్య రహిత’ భారతదేశాన్ని నిర్మిస్తున్నదనిపిస్తున్నది.
చేనేత రంగానికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాల ధరలు 40 శాతం పెరిగాయి. కాటన్, పట్టు దారాల ధరలు 60 శాతం పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో చేనేత రంగంపై మొత్తం జీఎస్టీని ఎత్తివేయాలి. కానీ జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతం పెంచడం చేనేత పరిశ్రమను సమాధి చేయడమేనని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ, కుటీర పరిశ్రమలకు కేంద్రప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సా హం ఇవ్వడం లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధిని కల్పిస్తున్న చేనేతరంగాన్ని దెబ్బతీయటం దేశ ఆర్థికవ్యవస్థను పాతాళంలోకి నెట్టివేయడమే. ‘ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు’ రద్దు నిర్ణయంతోనే కేంద్రానికి చేనేతరంగ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతున్నది.
గాంధేయ సోషలిజం తమ సిద్ధాంతంగా చెప్పుకొనే బీజేపీ గాంధీని కేవలం ‘కళ్ళజోడు’కే పరిమితం చేసింది. గ్రామీణ, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్న చేనేతరంగాన్ని దెబ్బతీయటం దేశ ఆర్థికవ్యవస్థను పాతాళంలోకి నెట్టివేయడమే.
తెలంగాణ ప్రభుత్వం చేయూత
దేశంలోని చేనేతకార్మికుల సగటు నెలసరి వేతనం రూ.6 నుంచి 8 వేలు. కాగా రాష్ట్రంలో సగటు వేతనం రూ.10-15 వేలుగా ఉన్నది. రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడి చేనేత, మరమగ్గాల రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సమానంగా రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించడం వల్ల చేనేత, మరమగ్గాల రంగాలు నిలబడుతున్నాయి. మగ్గాల లెక్కలను జియోట్యాగ్తో అనుసంధానించి నేతగాళ్లకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తున్నది రాష్ట్ర ప్రభు త్వం.ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఎఫ్ వంటి త్రిఫ్ట్ ఫండ్ కం సేవింగ్ పథకాన్ని చేనేత కార్మికులకు అమలుచేస్తున్నది. కార్మికుడు 8 శాతం పొదుపు చేస్తే దానికి 16 శాతం రాష్ట్ర ప్రభుత్వం కలిపి జమచేస్తున్నది. నూలు సబ్సిడీ పథకాన్ని 40 శాతం ఇస్తూ చేనేత రంగానికి అండగా నిలుస్తున్నది. పాఠశాల యూనిఫాం దుస్తులు, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల మరమగ్గాల ద్వారా ఏటా రూ.400 కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారుచేయిస్తున్నది. ఇలా కేసీఆర్ నాయకత్వంలో జౌళిశాఖామంత్రి కేటీఆర్ వస్త్ర పరిశ్రమ పురోభివృద్ధికి నిరంతరాయంగా కృషిచేస్తున్నారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ముందడుగు వేశారు. చేనేతరంగంపై 5 నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీని రద్దుచేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఇటీవలే లేఖ కూడా రాశారు. లక్షలాది చేనేత కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికి, దేశ సంస్కృతిని నిలబెట్టేందుకు చేనేతరంగంపై జీఎస్టీని కేంద్రం ఎత్తివేయాలి.
కర్నాటి విద్యాసాగర్
94913 93999