సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 25 : చేనేత సహకార సంఘం అధ్యక్షుడి నుంచి లంచం తీసుకొంటూ చేనేత, జౌళి శాఖ ఏడీ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వీవర్స్ సొసైటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఇన్సెంటివ్‌లు ఇవ్వడానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఓ సొసైటీ నుంచి సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ఇంచార్జిగా పనిచేస్తున్న చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే వెంకటరమణ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో రూ.10 వేలు ఇతరత్రా ఖర్చులు కాగా, రూ.20 వేలకు డీల్ కుదుర్చుకొన్నాడు. ఈ మేరకు ఆర్మూర్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రామకృష్ణ నుంచి సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లోని చేనేత శాఖ కార్యాలయంలో వెంకటరమణ రూ.20 వేలు లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. కేసు నమోదు చేసి వెంకటరమణను అదుపులోకి తీసుకొన్నట్టు ఆయన పేర్కొన్నారు.