కాళేశ్వరం ప్యాకేజీ -20, 21 పనుల్లో భాగంగా పైప్‌లైన్ వేసేందుకు అడ్డంకులు సృష్టించవద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రైతులను కోరారు. ఆదివారం ఆయన నిజామాబాద్ కలెక్టర్ చాంబర్లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ- 20, 21 పనుల పురోగతిపై సమీక్షించారు. పొలాల్లో పైప్‌లైన్ వేసేందుకు అక్కడక్కడ రైతులు ఆటంకాలు సృష్టిస్తున్నారని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పించి పైప్‌లైన్ వేసేందుకు ఇబ్బందుల్లేకుండా చూడాలని మంత్రి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీడు భూములకు నీటి వసతిని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని.. ఎవరూ అడ్డుకోవద్దని విన్నవించారు. ఈ సీజన్లో ఇబ్బందులు కలిగినా ఆ తర్వాత సాగు నీటి ప్రవాహంతో పొలాలన్నీ పచ్చబడి రైతులే ప్రయోజనం పొందుతారని అన్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ- 20, 21 పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. ఆదివారం నిజామాబాద్ కలెక్టర్ చాంబర్లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ఆయన మూడు గంటల పాటు సమావేశమయ్యారు. రెండు ప్యాకేజీల పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఇప్పటి వరకు సాధించిన నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ సీఈ మధుసూదన్ రావు మంత్రికి క్షేత్ర స్థాయిలో ప్యాకేజీ- 20, 21 పనుల పురోగతిని వివరించారు. పొలాల్లో పైప్‌లైన్ వేసేందుకు అక్కడక్కడ రైతులు ఆటంకాలు సృష్టిస్తున్నారని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా రైతులను చైతన్యవంతం చేసి పైప్‌లైన్ వేసేందుకు ఇబ్బందుల్లేకుండా చూడాలని మంత్రి సూచించారు. సమీక్ష అనంతరం మంత్రి రైతన్నలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. చేతులెత్తి మొక్కుతున్నా… కాళేశ్వరం ప్యాకేజీ -20, 21 పనుల్లో భాగంగా పైప్‌లైన్ వేసేందుకు అడ్డంకులు సృష్టించవద్దంటూ వేడుకున్నారు. బీడు భూములకు నీటి వసతిని కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అడ్డుకట్ట వేయొద్దని కోరారు. ఈ సీజన్లో ఇబ్బందులు కలిగినా ఆ తర్వాత సాగు నీటి ప్రవాహంతో పొలాలన్నీ పచ్చబడి రైతులే ప్రయోజనం పొందుతారని అన్నారు. ప్యాకేజీ-20, 21, 21(ఏ) ద్వారా ఆర్మూర్, బాల్కొం డ, నిజామాబాద్‌రూరల్ నియో జకవర్గాల్లోని రెండు లక్షల మెట్టభూములకు సాగునీరు ఇచ్చే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు.
త్వరలో 20వేల ఎకరాలకు గోదావరి జలాలు
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాళేశ్వరం ప్యాకేజీ- 20, 21 పనులు చేపట్టినట్లు మంత్రి వేముల వివరించారు. బినోల దగ్గరి నుంచి గోదావరి నీళ్లను తీసుకుని టన్నెల్ ద్వారా నీళ్లు తెచ్చి సారంగాపూర్ పంప్‌హౌస్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సారంగాపూర్ పంప్‌హౌస్‌లో కూడా పనులు పూర్తయినట్లు చెప్పారు.ఇక్కడ పంపులు, మోటర్లు అమర్చగా రెండు నెలల్లో వెట్ రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. సారంగాపూర్ నుంచి పంప్‌హౌస్ ద్వారా పాత నిజాంసాగర్ కాలువలో ఎత్తి పోసి కాలువ ద్వారా పారుతూ ఒక లైన్ మంచిప్ప చెరువుకు, మరో లైన్ మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్‌కు నీళ్లను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ నుంచి ఆర్మూర్, బాల్కొండ, మెట్పల్లి ప్రాంతాలకు నీళ్లు అందుతాయన్నారు. నెలలోనే వెట్ రన్ కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా నేపథ్యంలో పనులకు ఆటంకాలు ఎదురయ్యాయని, జనవరిలో మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ నుంచి జక్రాన్‌పల్లి మండలంలోని 14 గ్రామాలకు 14 వేల ఎకరాలు, వేల్పూర్ మండలంలోని నాలుగు గ్రామాల్లో ఆరు వేల ఎకరాలకు మొత్తం 20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మంచిప్ప వెళ్లే లైన్లో టన్నెల్ పూర్తయిందని, ఫీడర్ పంప్ హౌస్ పనులు నవయుగ వారు చేస్తున్నారని తెలిపారు. జూన్‌లో పంప్ హౌస్ పనులు పూర్తవుతాయన్నారు. జూలైలో డ్రైరన్, ఆగస్టులోగా మంచిప్పలో నీళ్లు పోసే విధంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక్కడి నుంచి గడ్కోల్ పైప్‌లైన్ ద్వారా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి నీళ్లు అందుతాయన్నారు. మంచిప్ప వద్ద రెండో పంప్ హౌస్ పనులను జూన్‌లోపు పూర్తి చేసి ఆగస్టులోగా నీళ్లు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, ఇరిగేషన్ సీఈ మధుసూదన్ రావు పాల్గొన్నారు.