హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఒంటిపూట బడి ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో 16 సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నిర్వహించనున్నారు. 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై.. 34 రోజులపాటు జరుగనున్నాయి. మొదట ప్రభుత్వం పదో తరగతి పరీక్ష కేంద్రాలు కలిగిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.
దీనిపై ఉపాధ్యాయ, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పరీక్షలు ఉన్న రోజుల్లోనే మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూళ్లు నడుపాలని నిర్దేశించింది. దీంతో పరీక్షలు లేని రోజుల్లో యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. కాగా, ఒంటిపూట బడిని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్ల యాజమానులు కఠిన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించింది. పాఠశాల విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.