వాషింగ్టన్: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అధికారమిచ్చే ప్రభుత్వ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2015 నిబంధనను ఆమోదించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్)కి ఉందని అప్పీల్స్ కోర్టు స్పష్టం చేయగా హెచ్-1బీ హోల్డర్లు, వారి జీవిత భాగస్వాములను అమెరికాలో అనుమతించే అధికారం డీహెచ్ఎస్కి ఉన్నప్పటికీ హెచ్-4 వీసాలపై ఉన్న డిపెండెంట్లు ఉద్యోగం చేయడానికి ఫెడరల్ ఇమిగ్రేషన్ ఒప్పుకోదని పిటిషనర్ వాదించారు.
అయితే ఈ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు హెచ్-4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి ఫెడరల్ చట్టాలు కూడా అంగీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులను హెచ్-1బీ ప్రోగ్రామ్ ఎదుర్కొంటున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు రావడం కీలక పరిణామం కానున్నది.