న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మరోసారి ఎత్తిచూపారు. మొన్న అధ్వాన రోడ్లపై విమర్శలు చేసిన ఆమె.. తాజాగా చెత్తపై మండిపడ్డారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేసినా పౌర సమస్యలను ఎత్తి చూపడంలో తాను వెనక్కి తగ్గనంటూ ఆమె ఈసారి బెంగళూరులో చెత్త సమస్యను గురువారం ఎక్స్‌లో ప్రస్తావించారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్యం ఏర్పడుతున్నదని విమర్శించారు.
‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది.’ అని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.