Kapil Sharma Cafe : ప్రముఖ హిందీ హాస్య నటుడు కపిల్ శర్మ (Kapil Sharma) కెఫేపై మరోసారి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కెనడాలోని సర్రేలో ఆయన నిర్వహిస్తున్న కఫ్స్ కెఫే (KAP’S CAFE)పై బుధవారం రాత్రి తుపాకులతో కాల్పులు జరిపారు. కారులో వచ్చిన తూటాల మోతతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే.. ఈ కాల్పులకు పాల్పడింది తామేనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్‌కు చెందిన గోల్డీ థిల్లాన్, కుల్దీప్ సిద్దూలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కపిల్ కెఫేపై దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
కారులో వచ్చిన దుండగులు కపిల్ శర్మ కెఫేకు సమీపం నుంచే కాల్పులు జరిపారు. కెఫే పరిసరాల్లోని ప్రజలను దూరంగా వెళ్లండి అని హెచ్చరించి ఈ చర్యకు పూనుకున్నారు. కారు కిటికీ నుంచి పులమార్లు కాల్పులకు పాల్పడిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అయితే.. ఆరురౌండ్లు కాల్పులు జరిపినట్టు తేలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి అదే కారులో పరారయ్యారు.
#BREAKING | Shots Fired At Comedian Kapil Sharma’s Cafe In Canada Again
NDTV’s @mukeshmukeshs Brings You The Details pic.twitter.com/kETd1BxQa3
— NDTV (@ndtv) October 16, 2025
‘నేను కుల్దీప్ సింగ్, గోల్డీ థిల్లాన్ గతంలో.. ఇప్పుడు జరిపిన కాల్పులకు బాధ్యత వహిస్తున్నాం. మాకు ఇక్కడి ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదు. అయితే.. మేము విరోధిగా భావిస్తున్న వ్యక్తికి మీరంతా దూరంగా ఉండాలి. అంతేకాదు చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నవాళ్లు, ప్రజలకు జీతాలు చెల్లించని వాళ్లు మా దాడులకు సిద్ధంగా ఉండాలి. మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బాలీవుడ్ స్టార్లు కూడా అప్రమత్తంగా ఉండండి. మా బుల్లెట్లు ఎక్కడి నుంచి దూసుకొస్తాయో చెప్పలేం’ అని హెచ్చరించారు.
ఆగస్టు 8వ తేదీన కూడా కపిల్ శర్మ కెఫేపై తూటాలు దింపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. కాల్పుల తర్వాత ఎక్స్‌లో తమ ఉద్దేశం ఏంటో వెల్లడించారు దుండగులు. ‘జై శ్రీరాం. అందరికి రామ్ రామ్. సర్రేలోని కపిల్ శర్మ కెఫెపై ఈరోజు జరిగిన కాల్పుల దాడి మా పనే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు అనుబంధంగా పని చేసే గోల్డీ ధిల్లాన్ గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడింది. మేము కపిల్‌కు ఫోన్ చేశాం. కానీ, అతడు ఫోన్ ఎత్తలేదు. అందుకే చర్యగా అతడి కెఫెపై కాల్పులు జరిపాం. ఇప్పటికీ కూడా మా ఫోన్ ఎత్తకుంటే.. ఈసారి ముంబైలో విధ్వంసం సృష్టిస్తాం’ అని తమ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఏడాది జూలై నెలలో కెనడాలో కప్స్ కెఫేను కపిల్ ప్రారంభించారు. కెఫెను తెరిచిన కొన్నిరోజులకే సిబ్బంది లోపల ఉండగానే ఉదయం 1:50 సమయంలో పలుమార్లు కాల్పులు జరిపారు దుండగులు. దాంతో కెఫే కిటికీలపై పది బుల్లెట్ రంధ్రాలు ఏర్పడ్డాయి. అయితే.. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ‘ది కపిల్ శర్మ షో’తో పాపులర్ అయిన కపిల్ హీరోగాను వెండితెరపై మెరిశాడు. ‘క్రూ’, ‘ఫిరంగీ’, ‘ట్యూబ్‌లైట్’, ‘కిస్ కిస్కో ప్యార్కరూన్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించాడీ కామెడీ కింగ్.