ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: రాష్ట్రవ్యాప్తంగా విజయ తెలంగాణ పాల ఉత్పత్తులకు ప్రజలకు చేరవచేసేలా అధికారులు నూతన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొనుగోలు చేసిన మూడు కొత్త వాహనాలను తెలంగాణ రాష్ట్ర పాల అభివృద్ధి సహకార సంస్థ (విజయ తెలంగాణ డెయిరీ) చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని దుకాణదారులు డెయిరీ ఉత్పత్తులు నగరానికి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లేవారని చెప్పారు. ఈ ఇబ్బందులు నివారిస్తూ ప్రజలకు విజయ ఉత్పత్తులను సులువుగా లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా రీజనల్ సేల్స్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా మొదటగా సిద్ధిపేట, వరంగల్, ఆదిలాబాద్ మార్గాల్లో నిర్ణీత రోజుల్లో వాహనాలు పాల ఉత్పత్తులతో తిరుగుతాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్గాల్లో పాల ఉత్పత్తులను పంపించేందుకు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీనికోసం రీజనల్ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పంపిణీ వ్యవస్థను ఐతం బలోపేతం చేస్తున్నామన్నారు. విజయ పాల ఉత్పత్తుల కోసం 040-27019852, 9121160512 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, రీజనల్ సేల్స్ డిప్యూటీ డైరెక్టర్ ధన్‌రాజ్, మార్కెటింగ్ జీఎం శ్రీనివాసరాజు, కామేశ్, క్వాలిటీ చీఫ్ కవిత, పాల సేకరణ జీఎం మధుసూదన్‌రావు, రమేశ్, సురేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.