బాధ్యతలు భుజానెత్తుకుంటే.. భారం పెరిగి బ్యాటింగ్ కష్టమవుతుందనే నానుడి తప్పని నిరూపిస్తూ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్‌లో ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలబడి జట్టుకు భారీ స్కోరు అందించిన హార్దిక్..ఆ తర్వాత మెరుపు ఫీల్డింగ్‌తో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను రనౌట్ చేశాడు. ఆఖర్లో భయపెట్టేందుకు చూసిన నీషమ్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపి విజయాన్ని పరిపూర్ణం చేశాడు. గత మ్యాచ్‌లో రైజర్స్ చేతిలో ఓటమి పాలైన గుజరాత్.. ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ముంబై: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ఆటతో తిరిగి అగ్రస్థానానికి చేరింది. కెప్టెన్ హార్దిక్ అన్నీ తానై మెలగడంతో లీగ్‌లో టైటాన్స్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో గుజరాత్ 37 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. అభినవ్ మనోహర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టారు. అభినవ్‌తో నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించిన హార్దిక్.. అజేయమైన ఐదో వికెట్‌కు మిల్లర్‌తో కలిసి 25 బంతుల్లోనే 53 పరుగులు జతచేయడం విశేషం. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, పరాగ్, కుల్దీప్ సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (24 బంతుల్లో 54; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. మిగిలిన వాళ్లు విఫలమవడంతో రాయల్స్‌కు పరాజయం తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్, యష్ దయాల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. హార్దిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా శుక్రవారం కోల్‌కతాతో హైదరాబాద్ తలపడనుంది.
గుజరాత్: 20 ఓవర్లలో 192/4 (హార్దిక్ 87 నాటౌట్; అభినవ్ 43; పరాగ్ 1/12), రాజస్థాన్: 20 ఓవర్లలో 155/9 (బట్లర్ 54; ఫెర్గూసన్ 3/23, యష్ దయాల్ 3/40).