కీవ్, మార్చి 27: రష్యా ఆక్రమిత భూభాగాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు త్వరలో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభిస్తామని ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కైరిలో బుడనోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్ను రెండు ముక్కలు చేసి మాస్కో నియంత్రిత రీజియన్‌ను ఏర్పాటు చేసేందుకు పుతిన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆదివారం పేర్కొన్నారు. ఉక్రెయిన్ను పూర్తిగా హస్తగతం చేసుకుంటామని యుద్ధానికి దిగిన పుతిన్, అందులో విఫలం కావడంతో ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారని, ఉక్రెయిన్ను ఉత్తర, దక్షిణ కొరియాలా మార్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. మరోవైపు రష్యా తన దాడులను కొనసాగిస్తున్నది. చిన్న నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. క్రూయిజ్ క్షిపణులతో లీవ్ సమీపంలోని సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో ఉక్రెయిన్ బలగాలు వినియోగించే ఇంధన డిపోతో పాటు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ రిపేర్ ప్లాంట్, రాడార్ స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. ఖార్కీవ్‌లోని అణు పరిశోధన కేంద్రంపై రష్యా మరోసారి షెల్లింగ్ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. రష్యా దాడులకు వ్యతిరేకంగా చెక్ రిపబ్లిక్, పరాగ్వే, లండన్లలో వేలాది మంది రష్యన్లు ర్యాలీలు చేపట్టారు.
రష్యాపై మరింత సమర్థవంతంగా పోరాడేందుకు యుద్ధవిమానాలు, గగనతన రక్షణ క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలు ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాలను మరోసారి కోరారు. చాలా వరకు తమ మిత్రదేశాలు చూస్తునే ఉండడం తప్ప ఏమీ చేయడం లేదని, ధైర్యం చేయాలని ఆదివారం వీడియో ప్రసంగంలో పేర్కొన్నారు. తాము రష్యాతో చేస్తున్న పోరాటం కేవలం ఉక్రెయిన్ స్వాతంత్య్రం కోసమే కాదని, ఐరోపా స్వేచ్ఛ కోసమని పునరుద్ఘాటించారు. రష్యా దాడులను ఉక్రెయిన్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఖార్కీవ్ తూర్పు, మరియుపోల్ వాయువ్య ప్రాంతాల్లోని పలు గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఖార్కీవ్ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. ఇందులో రష్యా సరిహద్దుకు 20 మైళ్ల దూరంలో ఉన్న విల్ఖివ్కా కూడా ఉన్నది.
ఉక్రెయిన్‌లోని లుహాన్స్ ప్రాంతం రష్యాలో చేరడంపై త్వరలో రెఫరెండం నిర్వహించనున్నది. దీనిపై స్థానిక వేర్పాటువాద నేత లియోనిడ్ పసేచ్నిక్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజలు గత ఎనిమిదేండ్లుగా నిరంతర షెల్లింగ్లను ఎదుర్కొన్నారని, రెఫరెండంకు ఓటింగ్ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి మధ్యప్రాచ్యంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పౌర అశాంతికి దారితీస్తుందని ఐఎంఎఫ్ హెడ్ క్రిస్టాలినా జార్జీవా హెచ్చరించారు. ఖతార్‌లో జరుగుతున్న దోహా ఫోరమ్‌లో ఆమె మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో రష్యాపై పలు దేశాల ఆంక్షలు కారణంగా పేదలు ద్రవ్యోల్బణం, ఉపాధి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.