న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గత రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు మళ్లీ భారీగా పెరిగాయి. జనవరి నెలకుగాను రూ.1.93 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 6.2 శాతం పెరిగాయి. దిగుమతులపై అధిక ఆదాయం సమకూరడం వల్లనే జీఎస్టీ వసూ ళ్లు మూడు నెలల గరిష్ఠ స్థాయికి తాకాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అలాగే రిఫండ్ 3.1 శాతం తగ్గి రూ.22,665 కోట్లకు పరిమితం కావడం కూడా మరో కారణమన్నారు. గత నెలలో నికర జీఎస్టీ వసూళ్లు 7.6 శాతం ఎగబాకి రూ.1.71 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. పొగాకు ఉత్పత్తులపై విధించిన సెస్‌తో అదనంగా రూ.5,768 కోట్లు జమయ్యాయి. దేశీయంగా జీఎస్టీ లావాదేవీలు 4.8 శాతం అధికమై రూ.1.41 లక్షల కోట్లు వసూలవగా, దిగుమతులు 10 శాతం ఎగబాకి రూ.52,253 కోట్లకు చేరాయి.