క్రైస్ట్‌చర్చ్: ఐసీసీ ప్యానల్ మ్యాచ్ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించిన.. ఆంధ్ర మాజీ ప్లేయర్ గండికోట సర్వ లక్ష్మీ మరో ఘనత తన పేరిట రాసుకోనుంది. ఆదివారం జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు లక్ష్మీ రిఫరీగా వ్యవహరించనుంది. తద్వారా ఈ ఘనత సాధించనున్న తొలి మహిళగా చరిత్రకెక్కనుంది. గతంలో పురుషుల వన్డే మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కిన లక్ష్మీ.. ఆదివారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ మ్యాచ్‌కు ఇద్దరు ఫీల్డ్ అంపైర్లతో పాటు టీవీ అంపైర్, రిఫరీ.. అందరూ మహిళలే కావడం విశేషం. ఐసీసీ చరిత్రలో నలుగురు మహిళలు ఒకే మ్యాచ్‌కు బాధ్యతలు నిర్వర్తించనుండటం కూడా ఇదే తొలిసారి.