హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఇందుకోసం టీజీపీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్న ట్టు సమాచారం. మరోవైపు గ్రూప్-1 మెయిన్ పరీక్షకు 1:50కి బదులుగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాల ఎంపిక విధానంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని, తమకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.
ఏవో ఫలితాలు విడుదల
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): అగ్రికల్చర్ ఆఫీసర్ ఫలితా లు బుధవారం టీజీపీఎస్సీ విడుదల చే సింది. 145మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. 2022లో నోటిఫికేషన్ విడుదల కాగా, 8,961 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 16న పరీక్షలు నిర్వహించారు.
ఏఈఈ ఎలక్ట్రికల్ ఫలితాలు విడుదల
ఏఈఈ(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ తుది ఫలితాలు విడుదల చేసింది. ఫలితాల కోసం అభ్యర్థులు వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.
1,575 కిలోల గంజాయి దహనం
భువనగిరి కలెక్టరేట్, జూన్ 26 : రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన 1,575 కిలోల గంజాయిని పోలీసులు దహనం చేశారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్పర్సన్ చం దనాదీప్తి, అర్బన్ రైల్వే డీఎస్పీ జావిద్ సమక్షంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం పరిధిలోని రోమా ఇండస్ట్రీ మెడికల్ వేస్టేజీ కంపెనీలో దీన్ని తగులబెట్టారు. చందనాదీప్తి మీడియాతో మాట్లాడుతూ.. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, నల్లగొండ, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో 52 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.4 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసినట్టు తెలిపారు.