లక్నో : మనసులు కలవలేదనో..అభిరుచులు ఒకటి కాదనో మనువుపై మనసు మార్చుకునే వారుంటారు. ఆలోచనలు కలవని వారు సైతం పెండ్లి విషయంలో పునరాలోచిస్తారు. కానీ పెండ్లి కూతురి హైస్కూల్ మార్క్ షీట్స్ పరిశీలించిన వరుడు ఆమెకు మార్కులు బాగా తక్కువగా వచ్చాయని వివాహం రద్దు చేసుకున్న ఘటన (Viral News) యూపీలోని కన్నౌజ్ జిల్లా తిర్వ కొత్వాలి ప్రాంతంలో వెలుగుచూసింది. వధువుకు స్కూల్ గ్రేడ్ తక్కువగా వచ్చినందుకు వివాహం రద్దు చేసుకున్నట్టు తనకు సమాచారం అందించారని పెండ్లికూతురి తండ్రి తెలిపారు.
కట్నం సరిపోయినంత ఇవ్వలేదనే మార్కుల సాకుతో పెండ్లి కుమారుడు వివాహం చేసుకునేందుకు నిరాకరించాడని వధువు తండ్రి ఆరోపించారు. పెండ్లి కొడుకు కట్నం డిమాండ్‌ను నెరవేర్చనందునే పెండ్లి రద్దయిందని యువతి బంధువులు సైతం ఆరోపించారు. వీరిద్దరి వివాహానికి నిశ్చయ తాంబూలాలు కూడా పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ తంతు పూర్తయిన తర్వాత పెండ్లికొడుకు అర్ధంతరంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని యువతి బంధువులు ఆరోపించారు.
పెండ్లికొడుకుపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది డిసెంబర్ 4న నిశ్చితార్ధం జరిగిందని, ఈ సమయంలో యువతి తండ్రి రూ. 60,000 ఖర్చు చేసి కార్యక్రమం నిర్వహించడంతో పాటు పెండ్లి కొడుకుకు ఉంగరం బహుకరించాడని యువతి బంధువులు చెబుతున్నారు. తాము వారు అడిగినంత కట్నం ఇవ్వలేకపోవడంతో పదో తరగతి మార్కులు సాకుగా చూపి వివాహం రద్దు చేశారని ఆరోపించారు. కాగా, ఇరు కుటుంబాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read More :
Viral Video | దైవ భక్తిలో మునిగితేలుతున్న కోతి.. రోజూ గుడికెళ్లి దండం పెట్టుకుంటున్నవీడియో వైరల్