అతడొక విదేశీయుడు.. కట్టింది ఒక ఆనకట్ట.. దాంతో సాగులోకి వచ్చిన విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు.. ఇది జరిగి 170 ఏండ్లవుతున్నది.
కానీ, ఇప్పటికీ ఆయనను..
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహామతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం
‘మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము’ అని తల్చుకుంటున్నారు లక్షలాది మంది గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు. కాటన్ విగ్రహాలకు నేటికీ ఊరూరా వందనాలు సమర్పిస్తున్నారు. ఆయనకు అంజలి ఘటిస్తున్నారు. కరువులతో, వరదలతో అతలాకుతలమయ్యే సీమను పాడిపంటల సీమగా మార్చిన ఒక ఆంగ్లేయ ఇంజినీర్‌కు ఆంధ్రులు తరతరాలుగా చూపుతున్న కృతజ్ఞత ఇది.
ఈమధ్య ఓ సందర్భంలో నాకు తెలిసిన సీనియర్ డాక్టర్ ఒకరు కలిశారు. మాట్లాడుకుంటూ ఉండగా ఆయన ఓ మాటన్నరు. ‘కేసీఆర్ మీద విమర్శలు చేసే వాళ్లు ఎక్కువయ్యారు. కానీ, ఆయన లేకపోతే తెలంగాణలో ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి ఉండేదా? అంటే,విమర్శలు చేయటానికి తెలంగాణీయులు ఇంతగా అలవాటు పడ్డరని అనుకోవాల్నా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఆయన సీనియర్ డాక్టర్ మాత్రమే కాదు.. రాజకీయ పరిణామాలను విశ్లేషించే పరిశీలకుడు కూడా. కాబట్టి.. ఆయన అభిప్రాయాల్ని తేలిగ్గా తీసుకోవటానికి లేదు. నిజంగానే.. ఈ మధ్య కాలంలో.. కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసే వాళ్లు ఎక్కువగానే కనిపిస్తున్నారు. విశేషమేమిటంటే.. వీరిలో చదువుకున్న వాళ్లు, పట్టణాల్లో
ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లే అధికం.
హైదరాబాద్‌లో ఉండే నాకు అటువంటి వాళ్లు తారసపడినప్పుడు నేను వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను..
మీ స్వగ్రామం ఉన్న ప్రాంతంలో సాగు నీటి వసతి పెరిగిందా? లేదా?
మీ ఊరిలో కరెంటు ఉంటుందా? మునుపటిలాగే మాటిమాటికీ పోతుందా?
తాగే నీళ్లను ఇంతకుముందులాగానే కొనుక్కుంటున్నరా? నల్లా వస్తున్నదా?
పట్నం నుంచి ఊరికి పోతుంటే రోడ్లు ఇంతకుముందులాగే ఉన్నయా? ఇప్పుడు బాగుపడ్డయా?
విచిత్రమేమిటంటే.. ఈ ప్రశ్నలకు నెగెటివ్ సమాధానం చెప్పాలన్నా వాళ్లకు దొరకటం లేదు. జరిగిన అభివృద్ధి నిజమేనని వారు ఒప్పుకోక తప్పటం లేదు. మరి అటువంటప్పుడు విమర్శలు ఎందుకు అంటే.. వారి దగ్గర సమాధానం ఉండదు. ఇది ఒక చిక్కుముడి లాంటి విషయం. లోపం ఎక్కడుంది?
గోదావరి మీద ఆనకట్ట కట్టిన కాటన్‌ను ఆంధ్రులు తరతరాలుగా స్మరించుకొని కృతజ్ఞతలు అర్పిస్తున్నారు. మరి, తెలంగాణీయులు ముఖ్యంగా విద్యావంతులు తమ కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని ఎందుకు చూడటం లేదు? సీమాంధ్ర పాలనలో తెలంగాణ పరిస్థితి ఏమిటి? నేడు ఎలా ఉంది? అన్న బేరీజు ఎందుకు వేసుకోవటం లేదు.
మన దేశంలోనే కాదు.. మన రాష్ట్రంలోనూ అత్యధికులు (జనాభాలో దాదాపు 60 శాతం) ఉపాధి పొందుతున్నది వ్యవసాయరంగంలోనే. పంటలు పండితేనే రైతుల వద్ద, వ్యవసాయం మీద పరోక్షంగా ఆధారపడిన ఇతర వృత్తుల వాళ్ల వద్ద డబ్బులు ఉంటాయి. వారి వద్ద డబ్బులుంటేనే మార్కెట్లో వస్తువులకు గిరాకీ ఉంటుంది. వాటికి గిరాకీ ఉంటేనే వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు నడిచి, వాటిలోని ఉద్యోగులకు జీతాలు అందుతాయి. సకల రంగాలూ కళకళలాడుతాయి. అంటే, ఆర్థికవ్యవస్థకు కేంద్రబిందువు
వ్యవసాయమే.
కాటన్ ఒక్క ఆనకట్ట కడితే ఆంధ్రప్రాంతం ముఖ్యంగా గోదావరి పరీవాహక జిల్లాలు సుసంపన్నం ఎందుకయ్యాయంటే ఇందుకే. ఆ ఒక్క ఆనకట్ట ఎంతటి మహత్తర మార్పులకు నాంది పలికిందో తెలుసా? దాని నుంచి ఆంధ్ర రైతాంగం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకొని సంపన్నులయ్యారు. అక్కడ మిగిలిన పెట్టుబడితో.. 1950వ దశకంలో అప్పుడప్పుడే ఆవిర్భవిస్తున్న సినీరంగంలోకి ప్రవేశించారు. వారి ఆస్తులు అనేక రెట్లు పెరిగాయి. అదే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారి ప్రభుత్వాలు అందించిన ప్రోత్సాహంతో పెట్టుబడులు పెట్టి భారీస్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అయ్యారు. ఒక్క ఆనకట్టతో 170 ఏండ్లలో జరిగిన పెనుమార్పులు ఇవి.
ఇది చరిత్ర. మనోనేత్రం తెరిచి చదివితే చరిత్ర పుస్తకాల్లో కనిపించే చరిత్ర. నేడు తెలంగాణలో ఇదే చరిత్ర మన కండ్ల ముందు నిర్మాణమవుతున్నది. నాడు ఆంధ్ర రైతులు అరిగోస పడినట్లుగానే ఏడేండ్ల కిందటిదాకా నానా కష్టాలు పడ్డారు మన తెలంగాణ రైతులు. అరకొరగా లభించే ఎరువులు, విత్తనాల కోసం షాపుల ముందు గంటలపాటు నిలబడి, నిలబడి ఓపిక లేక చెప్పులను లైన్లలో పెట్టి పక్కన సేదదీరేవారు. రాత్రిపూట వచ్చే కరెంటు కోసం పొలాలకు వెళ్లి కరెంటుషాకు తగిలి చనిపోయేవాళ్లు. ఏ ఆశా లేని ఎవుసం చేయలేక, మరో పని రాక చెట్లకు ఉరి వేసుకొని వేలాడేవాళ్లు. పేపర్లలో ఆ ఫొటోలు వచ్చేవి. తెలంగాణలో ఇవి సాధారణ దృశ్యాలైన విషాదం అప్పటిది. ఈ ఏడేండ్లలో అటువంటి దృశ్యాలు ఏ పేపర్లోనైనా కనిపిస్తున్నాయా?
కరెంటు లేక కర్మాగారాన్ని నడుపుకోలేక ఫ్యాక్టరీలోని సామాన్లను, యంత్రాలను జీడిమెట్ల, బాలానగర్, పటాన్చెరు రోడ్లపై పారిశ్రామికవేత్తలు అమ్మకానికి పెట్టిన ఫొటోలు పేపర్లలో వచ్చిన సంగతి మీకు గుర్తుకులేదా? ఈ ఏడేండ్లలో అటువంటి దృశ్యం ఏ పేపర్లోనైనా కనిపించిందా? వ్యవసాయంలో దేశంలోనే నెంబర్ వన్ అయిన పంజాబ్‌కు దీటుగా స్వరాష్ట్రం తెలంగాణ అభివృద్ధి చెందగలదని కలలోనైనా మీరు ఊహించారా?
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు కొన్ని వేల మంది వికలాంగులయ్యారు. కుటుంబాలకు కుటుంబాలే అల్లాడిపోయినయి. సీమాంధ్ర పాలకులు ఆరు దశాబ్దాలు పాలించినా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. కానీ, ఈ ఏడేండ్లలో నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య కనుమరుగైన విషయం మీకు తెలుసా?
ఉమ్మడి ఏపీలో తెలుగు సినిమాల్లో తెలంగాణ భాషను గేలి చేయటం ఆంధ్ర దర్శకులు, నిర్మాతలకు ఒక సరదా. అటువంటి సన్నివేశాలు మీకు ఏనాడైనా బాధ కలిగించేవా? ఇప్పుడు అటువంటి పరిస్థితి తెలుగు సినిమాల్లో ఉందా? తెలంగాణ జనజీవితానికి, భాషాసంస్కృతులకు నీరాజనం పట్టే సినిమాలు ఇప్పుడొస్తున్నాయి. ఈ మార్పు ఎలా సాధ్యమైందని అనుకుంటున్నరు?
‘ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు ప్రాజెక్టులు కావు.. గుడులు గుడులు కావు.. చెరువులు చెరువులు కావు.. కన్నీళ్లు కన్నీళ్లు కావు’ అని కేసీఆర్ తరచూ చెబుతుంటారు. సకల అంశాలపైనా నిర్లక్ష్యమే కదా నాడు. నేడు ఆ పరిస్థితి ఉందా? నాడు ఎంతో వివక్షకు గురైన యాదగిరిగుట్ట నేడు విఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదాద్రిగా పునఃనిర్మాణమవుతుందని మీరు ఏనాడైనా ఊహించారా?
కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆంధ్ర అనుకూల రాజకీయశక్తులను బలహీనపర్చకపోతే తెలంగాణలో ఎటువంటి అరాచక పరిస్థితులను వాళ్లు సృష్టించేవారో మీకు తెలుసా? 2014లో టీఆర్ఎస్ గెల్చిన తర్వాత.. ‘ఐదేండ్లలోపే ప్రభుత్వం మారుతుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారంటే.. ఎటువంటి వ్యూహాలకు, కుట్రలకు వాళ్లు తెర లేపి ఉంటారో మీరు ఊహించగలరా? ఓ వైపు విభజనచట్టంలో ఉమ్మడి రాజధాని అనే క్లాజు, మరోవైపు కేంద్రం నుంచి సహాయ నిరాకరణ, ఇంకోవైపు కోల్పోయిన అధికారాన్ని ఎప్పుడెప్పుడు మళ్లీ హస్తగతం చేసుకుందామా అని చూసే సీమాంధ్ర రాజకీయశక్తులు.. వీటన్నింటి మధ్య తెలంగాణలో రాజకీయ స్థిరత్వం సాధించటమంటే ఎంతటి కత్తిమీదసామో మీరు ఊహించగలరా? కేసీఆర్ ఎంతో దూరదృష్టితో, వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే ఇవే సీమాంధ్ర శక్తులు.. మనకు పాలించుకోవటం చేతగాదని, మనకు అభివృద్ధి చేసుకోవటం సాధ్యం కాదని మనతోనే అనిపించి, ‘అయ్యా! మళ్లీ ఆంధ్రతో మమ్మల్ని కలుపుకోండి.. మీరే మమ్మల్ని పాలించండి’ అని మనతోనే అడిగించేవాళ్లు అన్న సంగతి మీకు తెలుసా!
ఈ విజయాల్లో ఒక్కొక్కదానిని సాధించటానికి కనీసం ఒక్కో జీవితకాలం పడుతుంది. కానీ, దశాబ్దాల కల అయిన తెలంగాణను తీసుకు రావటమేగాక ఆ తర్వాత ఇన్ని విజయాలను మహానాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఏడేండ్లలో సాధించారు. రాజకీయ అధికారంలో తమకు భాగస్వామ్యం కల్పించినందుకు ఒకరిని, కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకు మరొకరిని సీమాంధ్ర జనం దేవుడిలా ఆరాధిస్తుంటే, యుగ పురుషుడిలా కొలుస్తుంటే మరి, ఇన్ని విజయాలు సాధించి మనకు అందించిన కేసీఆర్‌ను మనం ఎలా చూడాలి?
నిత్య గోదావరీ స్నాన
పుణ్యదోయోమహామతిః
స్మరామి తెలంగాణ దేశీయం
చంద్రశేఖరం తం భగీరథం
కె.వి.రవికుమార్
91827 77044