HomeNewsGrandmother Who Wrote Crore Property For Rickshaw
రిక్షావాలాకు కోటి ఆస్తి రాసిచ్చిన బామ్మ.. పాతికేండ్ల నిస్వార్థ సేవకు కృతజ్ఞత
భువనేశ్వర్, నవంబర్ 14: ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తనను, తన కుటుంబాన్ని పాతికేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుతూ, సేవ చేస్తున్న ఓ రిక్షావాలా రుణాన్ని తీర్చుకున్నారు ఓ బామ్మ. ఏకంగా కోటి రూపాయల విలువైన తన ఆస్తిని రాసిచ్చారు. అరుదైన ఈ ఘటన ఒడిశాలో ఇటీవల చోటుచేసుకున్నది. మినతీ పట్నాయక్ (63) గత పాతికేండ్లుగా కటక్‌లో ఉంటున్నారు. గతేడాది ఆమె భర్త మరణించారు. ఈ ఏడాది కూతురు కూడా చనిపోయింది. దీంతో మినతీ ఎంతో కుంగిపోయారు. బంధువులు ఎవ్వరూ ఆమెను చేరదీయలేదు. దుఃఖంతో కుంగిపోయిన ఆమెకు బుదాసామల్ అనే రిక్షావాలా దంపతులు ఆసరాగా నిలిచారు. అనారోగ్యం బారినపడ్డ ఆ వృద్ధురాలికి సేవ చేశారు. తన కోసం ఇంత చేసిన బుదాకు ఏమైనా సాయం చేయాలని ఆ బామ్మ అనుకున్నారు. తన మూడంతస్తుల భవనం, బంగారు ఆభరణాలను రాసిచ్చి కృతజ్ఞతను చాటుకున్నారు.