హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు.. క్రికెటర్లకు శాలువాలతో సన్మానం చేశారు. వీరితో పాటు టీమ్ఇండియా చీఫ్ కోచ్ నౌషిన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచకప్ విజేతలు త్రిష, ధ్రుతికి స్వాగతం పలికేందుకు క్రికెట్ అభిమానులకు ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ ‘కెరీర్లో రెండోసారి ప్రపంచకప్ గెలువడం చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా స్కాట్లాండ్పై రికార్డు సెంచరీకి తోడు దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన మరిచిపోలేనిది. జట్టు సభ్యులందరం ఒక కుటుంబంలా మెదులుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. రానున్న రోజుల్లో సీనియర్ జట్టుకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల మద్దతు మరువలేనిది’అని పేర్కొంది. మరోవైపు జగన్ స్పందిస్తూ ‘త్రిష, ధ్రుతిని స్ఫూర్తిగా మరింత మంది మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. త్రిష అద్భుత ప్రదర్శనతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసింది. త్వరలో అపెక్స్ కౌన్సిల్లో చర్చిం నగదు ప్రోత్సాహకం ప్రకటిస్తాం’ అని అన్నారు.