భీమదేవరపల్లి, ఏప్రిల్ 3 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలియకుండా, గ్రామాల్లో ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్లు పుట్టుకొస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలకు సైతం ఇంటి నంబర్లు ఇచ్చిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శులు అవాక్కయ్యారు. తమ సైట్హ్యాక్ అయిందేమోనని భయాందోళనకు గురతున్నారు. ఈ విషయంలో భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్ ఇటీవలే 27 మందికి నోటీసులు జారీ చేశారు.
తమకు తెలియకుండా, తమ ప్రమేయం లేకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్లు ఎలా వచ్చాయో 4వ తేదీలోపు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు ముత్తారం-2, కొప్పూరు-1, రత్నగిరి-6 ఇంటి నంబర్లు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఇదే జిల్లా ధర్మసాగర్ మండలంలో బయటపడిన ఈ నకిలీ భాగోతం భీమదేవరపల్లి మండలం వరకు ఎగబాకినట్లు తెలుస్తోంది. దీనిపై హనుమకొండ డీఎల్పీవో గంగభవాని స్పందించి ఇటీవలే భీమదేవరపల్లి సబ్‌రిజిస్ట్రార్‌తో మాట్లాడిన అనంతరం ముల్కనూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించినట్లు తెలిసింది.
ఓ పాత ఇంటికి అప్పటికే ఇంటి నంబర్ ఉంది. ఆ ఇంటిని అన్నదమ్ములు పంచుకున్నా, లేక ఖాళీ స్థలాన్ని షేర్ చేసుకున్నా పాత ఇంటి నంబర్ ఒకరికి పోతే, మరొకరికి అదే నంబర్‌తో బైవన్గా ఇంకో నంబర్ కేటాయిస్తారు. కానీ, ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఖాళీ ప్రదేశాలను ఓ ప్రైవేటు వ్యక్తి(ప్లానర్) ఇంటి ప్లాన్ గీస్తాడు. అతను ఇచ్చిన ప్లాన్ ఆధారంగా ఖాళీ జాగను సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడంతో ఇంటి నంబర్, అసెస్మెంట్ నంబర్ ఆటోమెటిక్‌గా వస్తుంది. దీంతో పంచాయతీ కార్యదర్శులకు తెలియకుండానే వారి లాగిన్లోకి ఈ ఇంటి నంబర్లు ఎంటర్ అవుతున్నాయి.
దీన్ని గమనించిన పంచాయతీ కార్యదర్శులు తమకు తెలియకుండా కొత్త నంబర్లు ఎలా లాగిన్ అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కనగండ్ల సదానందం తండ్రి కొమురయ్య, గ్రామం ముల్కనూరు పేరుమీద గ్రామపంచాయతీ కార్యాలయం ధృవీకరణ పత్రంతో అతడి కుమారుడు కనగండ్ల అఖిల్‌కు దానపత్రం సెటిల్మెంట్ ద్వారా 10-62 నంబర్ గల ఇంటిని 29-01-2022 తేదీన రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సదానందం సమర్పించిన గ్రామపంచాయతీ ధ్రువీకరణ పత్రంలో పంచాయతీ కార్యదర్శి ముద్ర, సంతకం రెండు ఫోర్జరీ అయ్యాయి.
దీనిని గుర్తించిన పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్ ముల్కనూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. మరోవైవు వరంగల్‌లోని ఎల్బీనగర్కు చెందిన మయోజుల సత్యంకు 2025 నవంబర్ ఒకటో తేదీన ముల్కనూరులోని పోచమ్మ గుడి సమీపంలో ఇంటి నంబర్, అసెస్మెంట్ నంబర్ వచ్చినట్లు తెలిసింది. దీనిపై పంచాయతీ కార్యదర్శి విచారణ చేపట్టగా అసలు అక్కడ వాళ్లు రిజిస్ట్రేషన్ గూగుల్ మ్యాప్‌లో చూపెట్టిన ఇల్లు వారిది కాదని తెలిసింది.
ఖాళీ జాగను దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా చెప్పుకుంటూ పోతే తవ్వినకొద్దీ పెంకులు బయటపడుతున్నాయి. కొప్పూరు, ముత్తారం, రత్నగిరి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామపంచాయతీ ప్రమేయం లేకుండా సబ్ రిజిస్ట్రార్ తమ ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే హనుమకొండ డీపీవోకు ఫిర్యాదు చేసినట్లు ముల్కనూరు పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్ వెల్లడించారు.
తమ ప్రమేయం లేకుండానే ఇంటి నంబర్, అసెస్మెంట్ నంబర్లు పొందిన 27మందికి నోటీసులు జారీ చేశాం. మరో రెండు రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నాం. ఇవేకాకుండా గ్రామపంచాయతీకి సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలను పట్టుకున్నాం. గ్రామపంచాయతీ కార్యాలయం ముద్ర, పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ ఉన్నట్లు గుర్తించాం. దీనిపై మూడు రోజుల క్రితం ముల్కనూరు ఠాణాలో ఫిర్యాదు చేశాం.
– జంగం పూర్ణచందర్, ముల్కనూరు పంచాయతీ కార్యదర్శి