హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ పురపాలకశాఖలో గ్రేడ్-1 టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా ముగ్గురికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఆశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం.. రూల్ 10(ఏ)(ఐ) కింద తెలంగాణ రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన (ఎంఏయూడీ) సర్వీస్ రూల్స్ 1998లోని రూల్ 8ని సడలించి (కనీసం ఐదేండ్ల సర్వీస్ అవసరాన్ని మినహాయించి) టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు గ్రేడ్-II నుంచి టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్-Iగా ఎన్ నిరుపమ, ఈ నాగమల్లేశ్వరి, సీ రమేశ్‌లకు తాతాలికంగా ప్రమోషన్ కల్పించారు.
అధికారుల నిర్లిప్తతతోనే విద్యాసంస్థల విచ్చలవిడితనం
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : అధికారుల నిర్లిప్తతతోనే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయని క్రైస్తవ జన సమితి అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ ఆరోపించారు. ఆయా విద్యాసంస్థలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజిలెన్స్ విచారణ, ఏసీబీ దాడులంటూ కథనాలొస్తున్నాయని, ఈ విద్యాసంస్థలకు అనుమతులిచ్చిన అధికారులపై ముందుగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడతలవారీగా చెల్లించాలని, ఇక నుంచి అధికారులతో పటిష్ట పర్యవేక్షణ చేయించాలని ప్రేమ్‌కుమార్ కోరారు.