హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాజుల సొమ్ము రాళ్లపాలు ఒకప్పుడు.. కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము నేతల పాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల పాలు అవుతున్నది. తెలంగాణలో పాలకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం మంత్రుల విలాసాలు, వారి ఫామ్‌హౌస్‌లకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో బిజీగా ఉంటున్నది. రోజుకో మంత్రి బాగోతం బయటపడుతుంటే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం వెలుగుచూసింది. ఓవైపు నిషేధిత భూముల్లో అక్రమ నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా సర్వీసు కనెక్షన్లు ఇచ్చి నకిలీ హైకోర్టు తీర్పులతో అక్రమాలకు పాల్పడిన రంగారెడ్డి జోన్‌లోని సైబర్ సిటీ సర్కిల్లోనే మరో బాగోతం బయటపడింది. మంత్రి వెంకటరెడ్డి తన ఫామ్‌హౌస్‌కు కరెంట్ కోసం ఏకంగా ప్రభుత్వసొమ్ముతోనే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈమేరకు టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. తన నిర్మాణానికి కిలోమీటర్ల కొద్దీ ఏబీ కేబుల్ లాగి ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన మేరకు టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు హడావుడిగా ఫైల్ కదిలించారు. అంచనాలు, మంజూరు పూర్తయి ప్రస్తుతం ఫీడర్ పనులన్నీ జరుగుతున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జోన్‌లోని సైబర్ సిటీ సర్కిల్లో ఉన్న మోకిలా డివిజన్ నుంచి ఈ పనులు జరుగుతున్నాయి.
సహజంగా ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేయాలంటే అందుకు తగిన లోడ్ ఉండాలి. కానీ ఇక్కడ అవసరమైన లోడ్ ఉన్నదా? లేదా? అనేది డిస్కమ్ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదు. మంత్రి చెప్పారంటూ అధికారులు ఆగమేఘాల మీద సెపరేట్ డెడికేటెడ్ ఫీడర్ కోసం రూ. 1.17 కోట్లతో అంచనాలు వేసి కార్పొరేట్ ఆఫీసుకు పంపించారు. మంజూరు కూడా వెంటనే ఇచ్చినట్టు తెలిసింది. ఈ పనులు పూ ర్తిచేయాలని మంత్రి కోమటిరెడ్డి నేరుగా సంస్థ యాజమాన్యంపైనే ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. మంత్రి కోమటిరెడ్డి పేరున చిల్కూరులో ఉన్న ఫామ్‌హౌస్‌కు ముర్తుజాగూడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి 11 కేవీ డెడికేటెడ్ సెపరేట్ ఫీడర్ వేయడానికి కావలసిన ఎస్టిమేట్ నెం.టీ-2628-65-01-13-04-001తో ఇచ్చారు. ఈ పనులను టీ అండ్ డీ ఇంప్రూమ్మెంట్స్ టు ఒరిజినల్ వర్క్స్ కింద మంజూరు చేసినట్టు అందులో పేర్కొన్నారు. ఆయన గురించే ఆరున్నర కిలోమీటర్ల మేర 185 స్కేర్ ఎంఎం ఏబీ కేబుల్ (ఎయిర్బంచ్ కేబుల్) నుంచి పోల్ల మీద లాక్కొస్తారు. పోల్లు కూడా ప్రత్యేకంగా వేశారు. ప్రజల సొమ్ము రూ.2 కోట్లను మంత్రిగారి ప్రత్యేక నిర్మాణానికి దక్షిణ డిస్కమ్ ఖర్చు చేస్తున్నది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రజలకు సంబంధించిన పనులైతే టీ అండ్ డీ విభాగంలో ఇంప్రూవ్మెంట్ పనులు ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్న పనులు పూర్తిగా వ్యక్తిగతం. డీసీడబ్ల్యూ విభాగం కింద అంచనా వేయాలి. డీసీడబ్ల్యూ కింద అయితే వినియోగదారు డబ్బులు కడితే తప్ప మంజూరు రాదు. కానీ కోమటిరెడ్డి విషయంలో ప్రజలకు సంబంధించిన టీఅండ్‌డీ సిరీస్‌లో పనులు పెట్టినందున పదిహేనురోజుల్లోనే మంజూరు ఇచ్చినట్టు కార్పొరేట్ ఆఫీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ప్రత్యేక హోదా కలిగిన వ్యక్తికి అంతగా అవసరమైతే రెండు ఫీడర్ల నుంచి సరఫరా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఆ ఇంటికి సరఫరా ఇచ్చిన పబ్లిక్ ఫీడర్ నుంచే కాకుండా ప్రత్యామ్నాయంగా మరో పబ్లిక్ ఫీడర్ నుంచి కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇలా ప్రత్యేకంగా డెడికేటెడ్ ఫీడర్‌ను ప్రజల సొమ్ము ద్వారా తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. సుమారు రూ.2కోట్ల ప్రజాధనాన్ని మంత్రి తన సొంతానికి వినియోగిస్తున్నట్టు ఎస్టిమేట్లు చెప్తున్నాయి. ప్రత్యేక ఫీడరే కాకుండా ఆరున్నర కిలోమీటర్ల మేర ఏబీ కేబుల్ లాగుతున్నారు. సాధారణంగా ఒక సర్వీసు కావాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. కాగా స్టోర్స్‌లో మెటీరియల్ ఇబ్బందులతో మూడునెలలుగా పనులన్నీ నిలిచిపోయిన పరిస్థితుల్లో మంత్రి పనులు వెంటవెంటనే పూర్తి చేస్తున్నారు. ఇదే ఇంటి దగ్గర నంబర్ 2 మంత్రి కూడా తన ఫామ్‌హౌస్‌కు సంబంధించిన నిర్మాణం పూర్తిచేస్తున్నట్టు తెలిసింది. ఈ నిర్మాణానికి కూడా కావాల్సిన కరెంట్‌ను ప్రత్యేక ఫీడర్ కిందే ఇవ్వాలని ఇప్పటికే ముఖ్య అధికారులకు ఆ మంత్రి హుకూం జారీ చేశారట. ప్రస్తుతం కోమటిరెడ్డి ఫామ్‌హౌస్‌కు ప్రత్యేక డెడికేటెడ్ ఫీడర్‌ను వేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సొంతానికి వాడుకున్నట్టేనని దక్షిణ డిస్కమ్లోనే చర్చ జరుగుతున్నది.