న్యూఢిల్లీ: స్వదేశంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ఆనందంలో డబుల్స్ ప్లేయర్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో అన్‌సీడెడ్ గాయత్రి-ట్రీసా ద్వయం 21-15, 21-12తో వరుస గేమ్స్‌లో 16 సీడ్ అమెరికా జోడీ లారెన్ లామ్ – అలీసన్ క్విన్ లీకి షాకిచ్చింది.
కానీ, కవిప్రియ సెల్వం – సిమ్రాన్ సింఘీ ద్వయం 7-21, 14-21తో బల్గేరియాకు చెందిన 9వ సీడ్ స్టోయేవా సిస్టర్స్ చేతిలో ఓడింది. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్యసేన్ 16-21, 21-8, 21-4తో కాలిన్స్ ఫిలిమోన్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 22-20, 21-16తో మయాన్మార్ షట్లర్ తుజార్పై పోరాడి గెలిచింది. కానీ, మిక్స్డ్ డబుల్స్ లో తెలంగాణ అమ్మాయి రుత్వికా శివాని-రోహన్ కపూర్, అషిత్ సూర్య – అమృత జంటలు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి.