తాడ్వాయి, డిసెంబర్ 24: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు పూజారులైన దబ్బకట్ల వంశస్తుడు గోవర్ధన్, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశస్తులైన బుచ్చి రాములు కుటుంబం, బంధుమిత్రులతో మంగళవారం రాత్రి గద్దెల వద్దకు చేరుకొని పూజా కార్యక్రమాలు పూర్తిచేసి జాగారం చేశారు. బుధవారం డోలివాయిద్యాల నడుమ సమ్మక్క, సారలమ్మ గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఈవో వీరస్వామి సమక్షంలో గద్దెలకు ధూప దీప, నైవేద్యాలు సమర్పించి గోవిందరాజు, పగిడిద్దరాజుల ధ్వజ స్తంభాలను ప్రతిష్ఠింపజేశారు.